- కర్ణాటకలోని మంగళూరులో ఘోరం
- ఫుట్ పాత్ పై నడిచి వెళుతున్న యువతులపైకి దూసుకుపోయిన కారు
- వారిని తొక్కుకుంటూ, ఎదురుగా వస్తున్న వ్యక్తిని ఢీకొన్న కారు
- ఆర్టీసీ ఎండీ సజ్జనార్ షేర్ చేసిన వీడియో
రహదారిపై నడిచే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నది అందరికీ తెలిసిందే. రోడ్డు పక్కగా నడవాలని పెద్దలు సూచిస్తుంటారు. కానీ, రహదారి పక్కన ఫుట్ పాత్ పై నడిచి వెళుతున్నా, ప్రాణాలకు నో గ్యారంటీ అనే విధంగా నేరాలు నమోదవుతున్నాయి. ఇలాంటి ఘోర ప్రమాదం ఒకటి కర్ణాటకలోని మంగళూరులో బుధవారం జరిగింది.
మంగళూరు పట్టణంలో డివైడర్ తో కూడిన రోడ్డు అది. వచ్చీపోయే వాహనాలకు వేర్వేరు లేన్లు ఉన్నాయి. పక్కనే విశాలమైన ఫుట్ పాత్ (పాదచారులు నడిచి వెళ్లే మార్గం) కూడా ఉంది. దానిపైనే నలుగురు యువతులు ఒకే బృందంగా నడిచి వెళుతున్నారు. ఆ సమయంలో వారు వెను దిరిగి చూసుకునే క్షణంలోనే వేగంగా వచ్చిన కారు వారిపై నుంచి దూసుకుపోయింది. కారు ఢీకొన్న వేగానికి వారు ఎగిరి పడ్డారు. వారి మీదుగా కారు ముందుకు వెళ్లి పోయింది. ఆ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో మహిళను ఢీకొట్టి వెళ్లిపోయింది. చూస్తుంటే వాహనదారుడు పూర్తిగా మద్యం మత్తులో, నియంత్రణ లేనట్టుగా కనిపిస్తోంది.
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోని తెలంగాణ ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ ట్విట్టర్ లో షేర్ చేశారు. వాహనదారులు ఎంతో జాగ్రత్తగా నడపాలనే సూచన చేశారు. ‘‘మితి మీరిన వేగం, అజాగ్రత్తే ఇలాంటి ఘోర ప్రమాదాలకు కారణం. వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇలాంటి ఘోర ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడతాయి’’ అని సజ్జనార్ పేర్కొన్నారు.