Bonda Uma: దసరా పండుగ కానుకగా జగన్ విద్యుత్ ఛార్జీలను పెంచబోతున్నాడు: బోండా ఉమ

Bonda Uma fires at YS Jagan government

  • ప్రజలపై మోపిన విద్యుత్ ఛార్జీల భారం రూ.64,388 కోట్లు అన్న బోండా ఉమ
  • తాజాగా ఒక్కో యూనిట్ పై రూ.1.15 పైసల భారం వేయబోతున్నాడన్న టీడీపీ నేత 
  • ఇప్పటికే  ట్రూఅప్ ఛార్జీల పేరుతో రూ.7,200 కోట్ల విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ఏపీఈఆర్సీ ముందుకు వచ్చిందని వెల్లడి
  • ఇప్పటికే జగన్ ఎనిమిదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడన్న బోండా ఉమ 

జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై తన భారం మోపారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ అన్నారు. గురువారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ప్రజలు నరకం అనుభవిస్తున్నారనే ఇంగితం కూడా లేకుండా తాజాగా ఏపీ ఈఆర్సీకి మరో రూ.7,200 కోట్ల వరకు ప్రతిపాదనలు పంపాడని, యూనిట్‌కు అదనంగా మరో రూ.1.15 పైసలు పెంచేందుకు సిద్ధమయ్యాడన్నారు. 

జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నేటి వరకు అంటే నాలుగున్నరేళ్లలో వివిధ రూపాల్లో ప్రజలపై రూ.64,388 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపాడన్నారు. చంద్రబాబు ఐదేళ్లు సీఎంగా ఉన్నా గతంలో ఏనాడూ ప్రజలపై  పైసా భారం మోపలేదన్నారు. ప్రజలపై భారం వేయకుండా వారికి నాణ్యమైన విద్యుత్‌ను కోతలు లేకుండా అందించి, రాష్ట్రాన్ని కూడా మిగులు విద్యుత్ ఉత్పత్తిలో నిలిపాడన్నారు. ఏపీ ప్రజలకు దసరా పండుగ కానుకగా జగన్, ఒక్కో యూనిట్ కు అదనంగా రూ.1.15 పైసలు పెంచబోతున్నాడన్నారు. ముఖ్యమంత్రి దసరా మామూళ్లు కొట్టేస్తూ, ప్రజలకు మాత్రం దమ్మిడీ మిగలకుండా చేస్తున్నాడన్నారు. 

జగన్ అధికారంలోకి వచ్చాక 2020లో ఒక్కో  యూనిట్‌పై రూ.90 పైసలు పెంచి రూ.1300 కోట్ల భారం వేశాడన్నారు. ఆ తర్వాత 2020లోనే కరెంట్ శ్లాబులు మార్చి నేరుగా ప్రజలపై మరో రూ.1500 కోట్ల భారం వేశాడన్నారు. 2021లో ప్రతి కిలోవాట్‌కు అదనంగా రూ.10లు పెంచడం వల్ల రూ.3,542 కోట్ల భారం పడిందన్నారు. గతంలో విద్యుత్ వినియోగించుకున్నారంటూ ట్రూ అప్ ఛార్జీల పేరుతో రూ.3,669 కోట్ల భారం వేశాడన్నారు. ఏప్రిల్ 2022న శ్లాబుల అడ్జెస్ట్‌మెంట్ పేరుతో రూ.3,900 కోట్ల భారం వేశాడని, ఫ్యూయల్ అండ్ పవర్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్ పేరుతో రూ.700 కోట్లు, 2021లో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల సర్దుబాటు ఛార్జీల పేరుతో రూ.3,082కోట్లు, 2023 ఫ్యూయల్ అండ్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్(ఎఫ్.ఏ.పీ.పీ.సీ) పేరుతో రూ.400 కోట్ల భారం వేశాడన్నారు.

ఇప్పుడు వీటన్నింటికీ అదనంగా ట్రూఅప్ ఛార్జీల పేరుతో మరో రూ.7,200 కోట్లను ప్రజల ముక్కుపిండి వసూలు చేయడానికి జగన్ సిద్ధమయ్యాడన్నారు. ఈ భారమంతా నేరుగా విద్యుత్ వినియోగదారులుపై పడుతుందని, ఇలా నాలుగున్నరేళ్ళ కాలంలో విద్యుత్ ఛార్జీల రూపంలో దాదాపు రూ.25,293 కోట్ల భారం వేశాడన్నారు. దీనికి తోడు విద్యుత్ డిస్కంలు, సరఫరా సంస్థలద్వారా పొందిన అప్పులు, ఇతర రుణాలు కలిపి  మొత్తంగా జగన్ ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలపై వేసిన భారం రూ.64,388 కోట్లు అన్నారు.

తన అవినీతికోసం కమీషన్ల కక్కుర్తితో రాష్ట్ర విద్యుత్ రంగాన్ని కూడా జగన్ పూర్తిగా భ్రష్టు పట్టించాడన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.36,261 కోట్ల అప్పులు తెచ్చిన జగన్,  హిందుజా సంస్థకు చెల్లించాలంటూ మరో రూ.2,834 కోట్ల అప్పులు తెచ్చాడన్నారు. డిస్కంలకు వైసీపీ ప్రభుత్వం రూ.34,776 కోట్లు బకాయి పడిందని, దీంతో విద్యుత్ డిస్కంలు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు రాక, పవర్ ఫైనాస్స్ కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చిమరీ జగన్ సర్కార్ తన స్వార్థానికి వాడుకోవడంతో డిస్కంల పరిస్థితి అగమ్యగోచరంగా తయరైందన్నారు.

బినామీ సంస్థలకు దోచిపెట్టాడు

ఏపీ.ఎస్సీ.డీ.సీ.ఎల్.కు రూ.15 వేల కోట్లు, సీ.పీ.డీ.సీ.ఎల్‌కు రూ.6,182 కోట్లు, ఈ.పీ.డీ.సీ.ఎల్‌కు రూ.5,000 కోట్లు, మూడు డిస్కంలపై రూ.3,500 కోట్ల భారాన్ని ప్రభుత్వం మోపిందన్నారు. పంచాయతీలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విద్యుత్ బకాయిలకు సంబంధించి రూ.5,000 కోట్ల భారాన్ని ప్రభుత్వం డిస్కంలపై వేసిందన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే మొత్తంగా వైసీపీ ప్రభుత్వం డిస్కంలకు రూ.34,776 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని, ఆ సొమ్ము ఇవ్వకపోవడంతో డిస్కంల మనుగడే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. జగన్మోహన్ ప్రభుత్వం అటు ప్రజల్ని, ఇటు డిస్కంలను దెబ్బతీస్తూ, రాష్ట్ర విద్యుత్ రంగాన్నే నామరూపాలు లేకుండా చేసిందన్నారు.

కమీషన్ కోసమే అధిక ధరకు విద్యుత్ కొనుగోలు
 
జగన్ ప్రభుత్వం బయట మార్కెట్‌లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తూ ప్రభుత్వరంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థల్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. కమీషన్ల కోసం అధికధరకు బయట నుంచి విద్యుత్ కొని వైసీపీ ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల కంటే రూ.12,200 కోట్లు అదనంగా చెల్లించిందన్నారు. ఈ సమాచారం సమాచారహక్కుచట్టం ద్వారా బయటకు వచ్చిందన్నారు. బహిరంగ మార్కెట్లో సగటున యూనిట్ విద్యుత్ ధర రూ.4.75 పైసలు ఉంటే, జగన్ సర్కార్ రూ.4.02 పైసలు అదనంగా చెల్లించి, ఒక్కో యూనిట్ ను రూ.8.77 పైసలకు కొనుగోలు చేసిందన్నారు. కమీషన్ల కోసం ఇదంతా చేస్తోందన్నారు. ఈ విధంగా అటు ప్రజల్ని, విద్యుత్ డిస్కంలను దారుణంగా దెబ్బతీసిన జగన్, మరోపక్క రైతుల మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టడానికి సిద్ధమయ్యాడన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమని చెబితే, జగన్ సర్కార్ మాత్రం అప్పులు, దోపిడీకోసం స్మార్ట్ మీటర్లు బిగించడానికి సిద్ధమైందన్నారు.

సెకీ ఒప్పందం ప్రకారం 17వేల యూనిట్ల సౌర విద్యుత్ ను యూనిట్ రూ.2.39 పైసలకు ఒకేసారి 30 ఏళ్లపాటు కొనేలా ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం ఇదే సెకీతో అదే సౌర విద్యుత్ ను యూనిట్ రూ.1.39 పైసలకే కొనేలా ఒప్పందం చేసుకుందన్నారు. ఏపీ ప్రభుత్వం  ఒక్కో యూనిట్ కు అదనంగా చెల్లించిన రూపాయి ఎటుపోయింది? ఎవరి జేబుల్లోకి పోయింది? అని ప్రశ్నించారు. 2020 డిసెంబర్లో సెకీ పిలిచిన టెండర్లలో గుజరాత్ ప్రభుత్వ డిస్కంలు ఒక్కో యూనిట్ విద్యుత్‌ను రూ.1.99 పైసలకు కొనడానికి టెండర్లు పిలిస్తే, ఏపీ ప్రభుత్వం మాత్రం యూనిట్ కు రూ.2.50 పైస లు కోట్ చేసిందని, యూనిట్ కు 51పైసలు అదనంగా కోట్ చేసిన సొమ్ము ఎటుపోయింది? అని నిలదీశారు. ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ప్రభుత్వం అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తూ రూ.22 వేలకోట్లు నేరుగా జగన్‌కు చేరేలా చేసిందన్నారు. ఏపీ ముఖ్యమంత్రికి మేలు చేయడానికే రాష్ట్ర విద్యుత్ సంస్థలు సెకీ ఒప్పందంలో అదనపు ధరకు టెండర్లు వేశాయని, సెకీ ఒప్పందాల ద్వారా రూ.22వేలకోట్లు కొట్టేసిన జగన్, మరోపక్క విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై రూ.26 వేలకోట్ల భారం వేశాడన్నారు.

ప్రభుత్వంలో చలనంలేదు


రైతుల మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే కాంట్రాక్ట్ ను తన బినామీ కంపెనీ అయిన షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ కు జగన్ అప్పగించాడని, ఆ సంస్థ నుంచే స్మార్ట్ మీటర్లు,  ట్రాన్స్ ఫార్మర్లు కొనాలనే నిబంధన పెట్టి  రైతుల్ని కూడా దోచేస్తున్నారన్నారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నా, రైతులు సబ్ స్టేషన్లు ముట్టడిస్తున్నా వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించే స్థితిలో జగన్ ప్రభుత్వం లేదన్నారు.
 
ఇంకా గతప్రభుత్వంపై నిందలేనా?

తాము వస్తే అన్ని వ్యవస్థల్ని రక్షిస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లయినా నేటికీ గత ప్రభుత్వం పైనే నింద లేస్తూ పబ్బం గడుపుతున్నాడన్నారు. తన దోపిడీ కోసం రాష్ట్ర విద్యుత్ రంగాన్ని సర్వ నాశనం చేసిన జగన్ రెడ్డిది అన్నారు. నేటికీ తన విషపత్రిక సాక్షిలో అన్నింటికీ టీడీపీ ప్రభుత్వమే కారణమంటూ దుష్ప్రచారం చేస్తున్నాడన్నారు. ప్రజల్ని భారాలతో బాదుతూ ఇప్పటికీ సిగ్గులేకుండా గతప్రభుత్వంపై నిందలేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. టీడీపీ ప్రభుత్వం రూపాయి విద్యుత్ ఛార్జీ పెంచకుండా ప్రజలకు మేలు చేస్తే, అప్పుడు లేని ట్రూ అప్ ఛార్జీలు, ఫ్యూయెల్ అడ్జస్ట్ మెంట్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు జగన్ వచ్చాకే ఎందుకు తెరపైకి వచ్చాయి? అని ప్రశ్నించారు. జగన్ అంతులేని అవినీతికి అంతిమంగా రాష్ట్రమే బలికానుందన్నారు. జగన్ విద్యుత్ రంగాన్ని తన ఆదాయవనరుగా మార్చు కున్నందునే నేడు రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయని, జగన్ కు విద్యుత్ నిర్వహణ, సరఫరా, తయారీ గురించి అసలే తెలియదన్నారు.

  • Loading...

More Telugu News