Virat Kohli: చాన్నాళ్లకు... మూడు బంతులు వేసి రెండు పరుగులిచ్చిన విరాట్ కోహ్లీ
- బౌలర్ అవతారమెత్తిన విరాట్ కోహ్లీ
- బౌలింగ్ చేస్తూ గాయపడిన హార్దిక్ పాండ్యా
- మోకాలి నొప్పితో బాధపడుతూ డగౌట్‌కు పరిమితమైన పాండ్యా
- మిగిలిన మూడు బంతులు వేసిన విరాట్ కోహ్లీ
స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ బౌలర్ అవతారమెత్తాడు. అయితే కేవలం మూడు బంతులే విసిరాడు. వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాతో మ్యాచ్ సందర్భంగా కోహ్లీ బౌలింగ్ చేయవలసి వచ్చింది. ఇన్నింగ్స్‌లోని తొమ్మిదో ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. ప్రాథమిక చికిత్స తీసుకున్న తర్వాత ఇబ్బందిపడ్డాడు. మోకాలి నొప్పితో బాధపడుతూ డగౌట్‌కు చేరాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఆ ఓవర్లో మిగిలిన మూడు బంతులను కోహ్లీతో బౌలింగ్ చేయించాడు.
మూడు బంతులు వేసిన విరాట్ కోహ్లీ రెండు సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. మీడియం పేస్, స్పిన్‌ను కలిపి వేసిన బౌలింగ్‌లో బంగ్లా బ్యాటర్లు షాట్ కొట్టేందుకు కూడా యత్నించలేదు. ఆరేళ్ల తర్వాత కోహ్లీ వన్డేల్లో బౌలింగ్ చేయడం మళ్లీ ఇదే మొదటిసారి. చివరిగా 2017 అగస్ట్ 31న శ్రీలంకపై రెండు ఓవర్లు వేసి 12 పరుగులు ఇచ్చాడు.