Rachel Edri: కాఫీ, కుకీలు ఇచ్చి ఉగ్రవాదులను 20 గంటలు ఏమార్చిన ఇజ్రాయెలీ మహిళ.. ప్రశంసల వర్షం కురిపించిన జో బైడెన్
- మాటలు కలుపుతూ పోలీసులు వచ్చే వరకు కాలక్షేపం
- పోలీసులు రావడంతో చంపేస్తామని ఉగ్రవాదుల బెదిరింపు
- చేతి వేళ్లతో ఇంట్లో ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నారని సైగలు
- చివరికి ఉగ్రవాదులను మట్టుబెట్టిన స్వాట్ బృందం
- రేచల్‌పై ప్రశంసలు కురిపించిన అమెరికా అధ్యక్షుడు
కష్టసమయాల్లో బాధతో కుంగిపోకుండా ధైర్యం కూడదీసుకుని ఆలోచిస్తే దాని నుంచి బయటపడొచ్చని నిరూపించారు 65 ఏళ్ల ఇజ్రాయెలీ మహిళ రేచల్ ఎడ్రి. హమాస్ ఉగ్రవాదుల చేతిలో తన ఇంట్లోనే 20 గంటలపాటు బందీగా గడిపిన ఆమె చివరికి చిన్న ఉపాయంతో వారి నుంచి బయటపడడమే కాదు.. వారిని ఏకంగా పైకి పంపడంలో పోలీసులకు సాయం చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి పాల్పడిన హమాస్ ఉగ్రవాదులు కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చి పడేశారు. ఇళ్లలోకి వెళ్లి మరీ మహిళలు, చిన్నారుల ప్రాణాలు తీశారు. ఈ క్రమంలో ఎంతోమందిని బందీలుగా చేసుకున్నారు. అలాగే, గ్రనేడ్లతో రేచల్ ఇంట్లోకి ప్రవేశించారు. రేచల్, ఆమె భర్తను బందీలుగా చేసుకున్నారు. వారి పిల్లలు ఇద్దరూ పోలీసులే. దీంతో రేచల్ దంపతులు బెదిరిపోయి హడలిపోలేదు. వారు వచ్చి ఎలాగైనా కాపాడతారని, కాకపోతే అప్పటి వరకు బతికి ఉండాలంటే ఉగ్రవాదులను ఏమార్చాలని నిర్ణయించుకున్నారు. ఉగ్రవాదులు ఆకలిగా ఉన్నట్టు గమనించి డ్రింక్ ఆఫర్ చేశారు. అలాగే, కాఫీ.. కుకీలు కూడా ఇచ్చి వారితో నెమ్మదిగా మాటలు కలిపారు. తాను ఇన్సులిన్ ఇంక్షన్ వేసుకోవాలని చెప్పి ఉగ్రవాదుల దృష్టి ఆమె పిల్లల వైపు వెళ్లకుండా జాగ్రత్త తీసుకున్నారు. అంతేకాదు, బిక్కుబిక్కుమంటూనే తనకు అరబిక్ నేర్పిస్తే తాను హిబ్రూ నేర్పిస్తానని ఉగ్రవాదులకు ఆఫర్ కూడా చేశారు.
అలా దాదాపు 20 గంటలపాటు వారిని ఏమారుస్తూ గడిపారు ఆ వృద్ధ దంపతులు. మరోవైపు, తన కుటుంబం ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న విషయం తెలుసుకున్న కుమారుడు పోలీసులతో కలిసి ఇంటికి వెళ్లాడు. వారి రాకను పసిగట్టిన ఉగ్రవాదులు రేచల్ దంపతులను చంపేస్తామని బెదిరించారు. ఇంటి తలుపులు బద్దలుగొట్టి ఇంట్లోకి ప్రవేశించేసరికి ఓ ఉగ్రవాది తల్లి మెడ పట్టుకుని చంపేస్తానని బెదిరించాడు. అయినప్పటికీ బెదరని ఆమె ఇంట్లో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్టు వేళ్ల సైగల ద్వారా కుమారుడికి చెప్పింది.
చివరికి అర్ధరాత్రి వేళ ‘స్వాట్’ బృందం ఆ ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టి రేచల్, ఆమె భర్త డేవిడ్‌ను రక్షించారు. రేచల్ ధైర్యసాహసాల గురించి అందరికీ తెలియడంతో రాత్రికి రాత్రే ఆమె హీరోగా మారిపోయారు. ప్రశంసల వర్షం కురిసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిన్న ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కొందరు పౌరులను కలిశారు. వారిలో రేచల్ కూడా కూడా ఉన్నారు. ఆమె ధైర్యసాహసాల గురించి తెలిసిన బైడెన్ ఆలింగనం చేసుకుని ప్రశంసించారు.