Telangana Assembly Election: ఓటరు ఐడీ ఉన్నంత మాత్రాన ఓటు ఉన్నట్లు కాదు... అప్రమత్తంగా ఉండండి: హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి
- ఒకసారి జాబితాను చెక్ చేసుకోవాలని సూచించిన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి
- ఓటరు జాబితాలో పేరు చెక్ చేసుకోవడంపై అవగాహన కల్పించిన అధికారులు
- voter.eci.gov.in లేదా voter help line యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చునని వెల్లడి
ఓటర్ ఐడీ కార్డు ఉన్నంత మాత్రాన మీ ఓటు ఉన్నట్లు కాదని, జాబితాలో ఒకసారి చెక్ చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ... ఓటర్ కార్డు ఉన్నంత మాత్రాన మీ ఓటు ఉందని భావించవద్దని ఓటర్లకు సూచించారు. ఓటరు జాబితాలో మీ పేరును మరోసారి చెక్ చేసుకోవాలన్నారు.
హైకోర్టులో స్వీప్ యాక్టివిటీ కింద ఏర్పాటు చేసిన రీ-చెక్ యువర్ ఓట్ కౌంటర్‌ను డిప్యూటీ డీఈవో అనుదీప్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు హైకోర్టు జడ్జిలు, న్యాయవాదులు, సిబ్బంది మాట్లాడి ఓటరు జాబితాలో తమ పేరును ఎలా చెక్ చేసుకోవాలో అవగాహన కల్పించారు. voter.eci.gov.in లేదా voter help line యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చునని తెలిపారు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే 1950 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలన్నారు.