USA: స్వలింగ సంపర్క వివాహాలను సుప్రీంకోర్టు గుర్తించకపోవడంపై తొలిసారి స్పందించిన అమెరికా
- భారత ప్రభుత్వ అడుగులను గమనిస్తున్నామని అమెరికా వ్యాఖ్య
- పౌరసమాజం స్పందనలనూ పరిశీలిస్తున్నామని వ్యాఖ్య
- పెళ్లిళ్ల సమానత్వానికి మద్ధతిస్తామని వెల్లడి
- యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆసక్తికర స్పందన
స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధంగా గుర్తించేందుకు భారత సుప్రీంకోర్టు నిరాకరించడంపై అగ్రరాజ్యం అమెరికా తొలిసారి స్పందించింది స్వలింగ దంపతులకు చట్టబద్ధ రక్షణ కల్పించేలా భారత్‌ను ప్రోత్సహించే ప్రయత్నం చేసింది. స్వలింగ వివాహ గుర్తింపును సుప్రీంకోర్టు నిరాకరించిన అనంతరం భారత ప్రభుత్వం వేయబోతున్న అడుగులను నిశితంగా గమనిస్తున్నట్టు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ గురువారం ప్రకటించింది. అంతర్జాతీయంగా పెళ్లిళ్ల సమానత్వానికి అమెరికా మద్ధతిస్తుందని యూఎస్ ప్రతినిధి స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, కోర్టు తీర్పు తర్వాత పౌరసమాజం నుంచి వస్తున్న స్పందనలను సైతం తాము ఆసక్తిగా గమనిస్తున్నామని వెల్లడించారు. ఎల్జీబీటీ హక్కులు సహా మానవ హక్కులపై భారత్‌తో నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉంటామని ఈ సందర్భంగా యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తన ప్రకటనలో గుర్తుచేసింది.
కాగా, స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధంగా గుర్తించే విషయం తమ పరిధిలో లేదని సుప్రీంకోర్టు ఈమధ్య అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది. ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ అంశంపై తుది నిర్ణయాన్ని పార్లమెంట్‌కే వదిలేస్తున్నామని తీర్పులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. స్వలింగ సంపర్కుల వివాహ వ్యవస్థను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యతిరేకిస్తోంది. స్వలింగ వివాహాలు భారతీయ కుటుంబ వ్యవస్థలోని భర్త, భార్య, పిల్లలతో ఎంతమాత్రం సరిసమానం కాదని వాదిస్తోంది.