Canada Diplomats: ముగిసిన డెడ్‌లైన్.. భారత్‌ను వీడిన 41 మంది కెనడా దౌత్యవేత్తలు

Canada Withdraws 41 Diplomats From India Amid Huge Diplomatic Row

  • గురువారం మీడియా సమావేశంలో కెనడా విదేశాంగ మంత్రి ప్రకటన
  • దౌత్యవేత్తల గుర్తింపు ఉపసంహరణ అనైతికమని మండిపాటు
  • ఇలాంటి చర్యలతో ప్రపంచంలోని ఏ దౌత్యవేత్తకూ రక్షణ ఉండదని వ్యాఖ్య
  • భారత్ విషయంలో తాము ఇలా చేయబోమన్న మంత్రి

కేంద్రం విధించిన డెడ్‌లైన్ ముగియడంతో 41 మంది కెనడా దౌత్యవేత్తలు గురువారం భారత్‌ను వీడారు. వారి వెంట వచ్చిన మరో 42 మంది కూడా స్వదేశానికి పయనమయ్యారు. సిక్కు వేర్పాటువాది, కెనడా పౌరుడు నిజ్జర్ హత్య వెనుక భారత సీక్రెట్ ఏజెంట్ల హస్తం ఉందన్న కెనడా ఆరోపణలపై భారత్ ఆగ్రహం వ్యక్తి చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, కెనడా దౌత్యవేత్తలు దేశం వీడాలంటూ గతంలో రెండు వారాల డెడ్‌లైన్ కూడా విధించింది.  ఈ గడువు ముగిసినా భారత్ బెట్టు సడలించకపోవడంతో కెనడా తన దౌత్యవేత్తలను వెనక్కు పిలిపించుకోవాల్సి వచ్చింది. 

ఈ పరిణామంపై కెనడా విదేశాంగ శాఖ మంత్రి మెలానీ జోలీ ఘాటుగా స్పందించారు. కెనడా దౌత్యవేత్తల గుర్తింపును భారత్ ఉపసంహరించుకోవడం అనైతిక, అసాధారణ చర్యగా ఆమె అభివర్ణించారు. దౌత్యసంప్రదాయాలకు సంబంధించి వియన్నా ఒడంబడికను భారత్ ఉల్లంఘించిందని ఆమె మండిపడ్డారు. 

‘‘దౌత్యవేత్తల గుర్తింపు రద్దుతో భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వారిని స్వదేశానికి తరలించాం. దౌత్య గుర్తింపు రద్దు లాంటి నిర్ణయాలతో ప్రపంచంలోని ఏ దౌత్యవేత్తా క్షేమంగా ఉండరు. కాబట్టి మేము భారత దౌత్యవేత్తల విషయంలో ఇలాంటి చర్యను చేపట్టబోము’’ అని మంత్రి మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News