Elon Musk: ఒకేసారి సుమారు రూ.13 లక్షల కోట్లు నష్టపోయిన ఎలాన్ మస్క్.. కారణం ఏంటంటే..!
- టెస్లా కంపెనీ త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడమే కారణం
- మస్క్ వ్యక్తిగత సంపదపై తీవ్ర ప్రభావం
- అయినా సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలోనే మస్క్
ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధినేత, ట్విట్టర్ (ఎక్స్) బాస్ ఎలాన్ మస్క్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఏకంగా 209.6 బిలియన్ డాలర్లతో ప్రపంచ సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న వ్యక్తి ఆయన. అయితే గురువారం ఒకే రోజు ఆయన సంపద భారీగా కరిగిపోయింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 16.1 బిలియన్ డాలర్ల మేర ఆయన నష్టాన్ని చవిచూశారు. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.13 లక్షల కోట్ల మేర సంపదను కోల్పోయారు. మూడో త్రైమాసిక ఫలితాల్లో టెస్లా కంపెనీ ఆశించిన మేర రాణించలేకపోవడమే ఇందుకు కారణమైంది. కార్ల విక్రయాలు కూడా పేలవంగా ఉండడంతో కంపెనీ షేర్ల విక్రయానికి ఇన్వెస్టర్లు మొగ్గుచూపారు. ఫలితంగా 9.3 శాతం మేర షేర్లు పతనమయ్యాయి.
ఈ ప్రభావం ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపదపై గట్టిగానే ప్రభావం చూపింది. ఆయన 16.1 బిలియన్ డాలర్ల మేర నష్టపోవాల్సి వచ్చింది. కాగా ఎలాన్ మస్క్ సంపదలో టెస్లా వాటా దాదాపు 13 శాతంగా ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. గురువారం భారీ నష్టాన్ని చవిచూసినప్పటికీ 2023లో ఎలాన్ మస్క్ సంపద ఏకంగా 70 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. ఇందులో టెస్లా షేర్ల భాగస్వామ్యం కీలకంగా ఉంది. కంపెనీ అన్ని విధాలా దృఢంగా ఉండడంతో షేర్లు భారీగా ఎగశాయి. ఈ కారణంగానే ప్రపంచ సంపన్నుల జాబితాలో రెండవ స్థానంలో ఉన్న ఫ్యాషన్ దిగ్గజం ఎల్‌వీహెచ్ఎం కంపెనీ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్డ్‌కు మస్క్ అందనంత ఎత్తులో నిలిచారు.