throat cancer: గొంతు నొప్పి, బొంగురు ఎంతకీ తగ్గకపోతే.. నిర్లక్ష్యం చేయొద్దు!
- గొంతు కేన్సర్ లోనూ కనిపించేది ఇలాంటి లక్షణాలే
- గొంతులో ఏదో అడ్డు ఉన్నట్టు భావన, మింగలేకపోవడం
- శ్వాసకు కష్టం కావడం, గొంతులో కణితి ఉంటే వైద్యులను సంప్రదించాలి
గొంతు నొప్పి, గొంతులో మంట, బొంగురు పోవడం.. ఇలాంటివి అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. రుతువు మారినప్పుడు లేదంటే వాతావరణంలో మార్పులు, చల్లటి నీరు తాగడం, పడని పదార్థాలు తీసుకోవడం, ఫ్లూ వైరస్ ల కారణంగా గొంతులో ఇన్ఫెక్షన్ ఏర్పడి ఈ సమస్యలు కనిపిస్తుంటాయి. జలుబు చేసినప్పుడు కూడా ఇలాంటి లక్షణాలు కొందరిలో ఉంటాయి. ఇవన్నీ సాధారణమైనవి. కానీ, ఈ గొంతు నొప్పి, మంట ఎన్ని రోజులు అయినా తగ్గకపోవడం, యాంటీ బయోటిక్ కోర్సులు వాడినప్పుడు తగ్గినట్టు తగ్గి మళ్లీ వెంటనే వస్తున్నట్టు అయితే నిర్లక్ష్యం చేయవద్దంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎందుకంటే గొంతు కేన్సర్ లోనూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. గొంతు కేన్సర్ ఆరంభ దశలో ఇలాంటివి ఏవీ ఉండవు. కేన్సర్ తీవ్రమవుతున్న దశలో కనిపించొచ్చు. గొంతులో ఇలాంటి లక్షణాలకు తోడు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు, పొడి దగ్గు, గొంతులో ఏదో అడ్డు ఉందని (ఫారీన్ బాడీ) అనిపించడం, మింగడం కష్టమనిపించడం, గొంతులో కణితి, వాయిస్ మారిపోవడం కనిపిస్తుంటే ఒక్కసారి తప్పకుండా వైద్యులను సంప్రదించి నిర్ధారణ చేసుకోవాలి. వీలైనంత వెంటనే ఈఎన్ టీ వైద్య నిపుణులను సంప్రదించడం ద్వారా అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. వీడియో లారింగో స్కోపీ ద్వారా వైద్యులు గొంతు భాగాన్ని పరిశీలిస్తారు.
గొంతు కేన్సర్ అనేది పెదాలు, బుగ్గలు, చిగుళ్లు, నాలుక, అంగిలి, టాన్సిల్స్ కు విస్తరించొచ్చు. లారింజీల్ కేన్సర్ లో స్వరం కూడా మారిపోతుంది. మింగడానికి కష్టమవుతుంది. హైపో ఫారింజీల్ కేన్సర్ లో మింగడం కష్టంగా ఉండడానికి తోడు, అదే పనిగా గొంతు నొప్పి, మంట వేధిస్తాయి. పొగాకు ఉత్పత్తుల అలవాట్లు ఉన్న వారికి హైపో ఫారింజీల్ కేన్సర్ రిస్క్ ఎక్కువ. కేన్సర్ కారణంగా చెవి నొప్పి కూడా రావచ్చు. కేన్సర్ ను ముందుగా గుర్తిస్తే చికిత్స సులభం. అందుకే గొంతు సమస్యలు తగ్గకుండా వేధిస్తుంటే సమయాన్ని వృధా చేయరాదు.