world cup: కోహ్లీ చేసిన దాంట్లో తప్పేముంది?: కృష్ణమాచారి శ్రీకాంత్
- ప్రతిరోజూ సెంచరీ చేసే అవకాశం రాదన్న గవాస్కర్
- బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో కోహ్లీ స్ట్రయిక్ రొటేషన్ పై విమర్శలు
- కోహ్లీ ఆటను సమర్థించిన మాజీ ఆటగాళ్లు
క్రికెట్ లో ఏ ఆటగాడికైనా ప్రతీరోజూ సెంచరీ చేసే అవకాశం రాదని టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ చెప్పారు. ఆ అవకాశం వచ్చినపుడు వదులుకోవద్దని భావించడం తప్పేమీ కాదని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో స్ట్రయిక్ రొటేట్ చేయకుండా కోహ్లీ స్వార్థపూరితంగా వ్యవహరించారన్న విమర్శలను గవాస్కర్ తిప్పికొట్టారు. వ్యక్తిగత స్కోర్ 70 పరుగులు దాటినపుడు సెంచరీ చేయాలనుకోవడం తప్పు కాదని చెప్పారు. కోహ్లీ ఆటతీరులో తనకు తప్పు కనిపించలేదన్నారు.
ఈ విషయంపై మరో మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా స్పందించారు. కోహ్లీపై విమర్శలను ఆయన తప్పుబట్టారు. క్రికెట్ పరిజ్ఞానం లేని వ్యక్తులను ఒకటే అడుగుతున్నా.. విరాట్ కోహ్లీ చేసిన దాంట్లో తప్పేముంది? అని నిలదీశారు. ప్రపంచకప్ టోర్నీలో సెంచరీ చేయడం మామూలు విషయం కాదన్నారు. బంగ్లాదేశ్ జట్టుపై సెంచరీ చేసినందుకు కోహ్లీని, సహకరించినందుకు కేఎల్ రాహుల్ ను అభినందిస్తున్నానని శ్రీకాంత్ ట్వీట్ చేశారు.