Crime News: ఆస్ట్రేలియా చేతిలో ఓడిన పాకిస్థాన్‌కు మరో షాక్
- వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకున్న పాక్
- పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి దిగజారిన దాయాది
- 4వ స్థానానికి ఎగబాకిన ఆస్ట్రేలియా.. కీలకమైన రన్‌రేట్
శుక్రవారం రాత్రి బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ మరో ఓటమిని మూటగట్టుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 368 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. పాక్ ఓపెనర్లు ఇమామ్ హుల్ హక్, అబ్దుల్లా మొదటి వికెట్‌కు 134 పరుగుల చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పినా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేకపోయారు. కీలక సమయాల్లో వికెట్లు సమర్పించుకున్నారు. 305 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో ఆస్ట్రేలియా 62 పరుగుల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
అయితే, ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన పాకిస్థాన్‌కు పెద్ద షాక్ తగిలింది. వరల్డ్ కప్ 2023 పాయింట్ల పట్టికలో టాప్ 4వ స్థానం నుంచి 5వ స్థానానికి దిగజారింది. పాకిస్థాన్ స్థానాన్ని ఆస్ట్రేలియా ఆక్రమించింది. ఇరు జట్లు చెరో 2 విజయాలతో సమానమైన పాయింట్లతో ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా రన్‌రేట్ కాస్త మెరుగ్గా ఉంది. దీంతో ఆస్ట్రేలియా తన స్థానాన్ని మెరుగుపరచుకోగా.. పాక్ దిగజార్చుకుంది. కాగా భారత్ వేదికగా జరుగుతున్న ప్రస్తుత వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌కు ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ విజయం లభించలేదు. ఇప్పటివరకు నెదర్లాండ్స్, శ్రీలంకపై గెలుపొందగా, భారత్, ఆస్ట్రేలియా చేతుల్లో ఓటమిపాలైంది. ఇకపై ఆడబోయే మ్యాచుల్లో రాణిస్తేనే పాకిస్థాన్ సెమీఫైనల్ చేరుకునే అవకాశాలు లభిస్తాయి. లేదంటే ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది.