World Cup 2023: న్యూజిలాండ్-భారత్.. ఎవరికి ఎక్కువ విజయావకాశాలు?
- ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ పై న్యూజిలాండ్ దే పైచేయి
- అధిక విజయాలు కివీస్ జట్టుకే సొంతం
- 2003 తర్వాత కివీస్ చేతిలో భారత్ గెలిచింది లేదు
వన్డే ప్రపంచకప్ లో న్యూజిలాండ్-భారత్ ఈ ఆదివారం ధర్మశాల వేదికగా పోటీ పడనున్నాయి. రెండింటికీ ఇది ఐదో మ్యాచ్ అవుతుంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఈ రెండు జట్లు ప్రత్యర్థులను మట్టి కరిపించి బలంగా కనిపిస్తున్నాయి. దీంతో టాప్ 2 జట్ల మధ్య పోటీపై భారీ అంచనాలే నెలకొన్నాయి . ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారనేది ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ పై విజయావకాశాలు న్యూజిలాండ్ కే ఎక్కువగా ఉన్నట్టు ఇప్పటి వరకు ఉన్న గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తుంది. న్యూజిలాండ్ జట్టు సమష్టిగా రాణించడాన్ని గమనించొచ్చు. ఎవరో ఒకరిద్దరిపైనే ఆధారపడే విధంగా ఆ జట్టు లేదు. నాలుగు సార్లు వన్డే కప్ ఫైనల్ కు చేరుకున్న చరిత్ర వారిది.
ఐసీసీ టోర్నమెంట్లలో న్యూజిలాండ్ ను భారత్ చివరిగా ఓడించింది ఎప్పుడో తెలుసా..? 2003 ప్రపంచకప్ లో. సౌరవ్ గంగూలీ సారథ్యంలో ఏడు వికెట్ల తేడాతో విజయం దక్కించుకుంది. ఆ తర్వాత నుంచి ఐసీసీ టోర్నమెంట్లలో న్యూజిలాండ్ తో ఆడిన ప్రతిసారీ భారత జట్టు చేదు ఫలితాలనే చవిచూసింది. 2016 టీ20 వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యమిచ్చింది. అయినా కానీ సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో మట్టికరిచింది. న్యూజిలాండ్ ను భారత బౌలర్లు 126 పరుగులకే కట్టడి చేశారు. కానీ, న్యూజిలాండ్ బౌలర్లు భారత్ పోరాటాన్ని 79 స్కోరుకే పరిమితం చేయడంతో 47 పరుగుల విజయం న్యూజిలాండ్ సొంతమైంది. 2019 వన్డే ప్రపంచకప్ లోనూ సెమీ ఫైనల్స్ లో భారత్ న్యూజిలాండ్ చేతిలో పరాజయం ఎదుర్కొన్నది. మరి ఈ విడత ఆట, అదృష్టం ఎవరి వైపు ఉంటుందో చూడాలి.