Nara Lokesh: మీ కుటుంబంలోని విషయాలు బయటపెడితే తల ఎక్కడ పెట్టుకుంటావ్?: జగన్ పై నారా లోకేశ్ ఫైర్
- టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు
- ఇందిరాగాంధీకే భయపడలేదు.. మరుగుజ్జు జగన్ కు భయపడతామా అని ఎద్దేవా
- పవన్ తో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడి
ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నేతలపై టీడీపీ యువనేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఏపీని సర్వనాశనం చేశారని, అప్పుల ఊబిలోకి నెట్టేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో పాలనను ప్రారంభించిన జగన్... తన అరాచక పాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. ఏ తప్పూ చేయని చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన తప్పా? అని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రానికి అనేక పరిశ్రమలను తెచ్చారని... ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించారలని... అదే ఆయన చేసిన నేరమా? అని అడిగారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి టీడీపీ పోటీ చేయబోతోందని లోకేశ్ తెలిపారు. జనసేన శ్రేణులతో కలిసి టీడీపీ శ్రేణులు పోరాడాలని సూచించారు. జనసేనాని పవన్ కల్యాణ్ తో సమావేశమై... భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని చెప్పారు. చంద్రబాబుకు పంపించే ఆహారంలో వారి కుటుంబ సభ్యులే ఏదైనా కలపొచ్చంటూ వైసీపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. భోజనంలో విషం కలపడం, కోడికత్తి డ్రామాలు తమ కుటుంబ డీఎన్ఏలోనే లేవని చెప్పారు. విషం కలపడం, బాబాయ్ ని లేపేయడం వంటివి జగన్ డీఎన్ఏలో ఉన్నాయని అన్నారు.
మీ కుటుంబంలోని విషయాలను బయటపెడితే తల ఎక్కడ పెట్టుకుంటావ్ జగన్ అని లోకేశ్ ప్రశ్నించారు. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లొద్దని, రాజకీయపరంగానే పోరాడాలని తమ అధినేత చంద్రబాబు చెప్పారని... అందుకే తాము సంయమనం పాటిస్తున్నామని... లేకపోతే మీకంటే ఎక్కువ మాట్లాడగలమని చెప్పారు. ప్రజల కోసం తాము పోరాడుతున్నామని... ఏ తప్పు చేయని తాము ఎవరికీ భయపడబోమని అన్నారు.
చంద్రబాబు జైల్లో ఉంటే టీడీపీ భయపడుతోందని సైకో జగన్ అంటున్నాడని... భయం అనేది టీడీపీ రక్తంలోనే లేదని లోకేశ్ చెప్పారు. ఇందిరాగాంధీకే భయపడలేదని... మరుగుజ్జు జగన్ కు భయపడతామా? అని ఎద్దేవా చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేసి టీడీపీని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడమే జగన్ లక్ష్యమని చెప్పారు. 2019కి ముందు తనపై కేసులు లేవని... ఇప్పుడు ఎన్నో కేసులు ఉన్నాయని చెప్పారు. తన తల్లి ఐటీ రిటర్నులు చూపి, ఆమెపై కేసు పెడతామని బెదిరించారని మండిపడ్డారు.
రూ. 500 కోట్లతో జగన్ భవనాన్ని నిర్మించుకున్నారని లోకేశ్ విమర్శించారు. లక్ష రూపాయల చెప్పులు వేసుకునే జగన్ పేదవాడా? అని ప్రశ్నించారు. నవంబర్ 1 నుంచి బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని తెలిపారు.