Motkupally: జగన్.. నీకేమైనా సిగ్గుందా? అంటూ మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు
- అధికారంలోకి రాగానే జగన్ కు మైకం కమ్మిందని విమర్శ
- చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్ దే బాధ్యతని హెచ్చరిక
- ఆయనను జైలులో పెట్టి రాక్షసానందం పొందుతున్నాడన్న మోత్కుపల్లి
యువకుడు, ఉత్సాహవంతుడు ఒకసారి అవకాశం ఇస్తే బాగా పాలిస్తాడనే ఉద్దేశంతో జగన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవకాశం ఇచ్చారని మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. తాను కూడా అదే ఉద్దేశంతో గత ఎన్నికలకు ముందు జగన్ కు ఓటేయాలని పిలుపునిచ్చానని చెప్పారు. అయితే, అధికారంలోకి రాగానే జగన్ కు మైకం కమ్మిందని విమర్శించారు. తన విజయానికి పాటుపడ్డ తల్లిని, చెల్లిని జగన్ బయటకు పంపించాడని ఆరోపించారు.
ప్రజల కోసమే నిరంతరం ఆలోచించే ప్రజా నాయకుడు చంద్రబాబును జైలుకు పంపి జగన్ రాక్షసానందం పొందుతున్నాడని విమర్శించారు. ‘జగన్.. వయసులో చిన్నవాడివి.. నీకేమైనా సిగ్గుందా.. చంద్రబాబు లాంటి గొప్ప నాయకుడిని అరెస్టు చేయిస్తావా’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు శనివారం ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించిన మోత్కుపల్లి, ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించారు.
చంద్రబాబు అవినీతికి పాల్పడే నేత కానే కాదని, క్రిమినల్ అసలే కాదని మోత్కుపల్లి స్పష్టం చేశారు. స్కిల్ కేసు పేరుతో ఎన్నికల ముందు అరెస్టు చేయించడాన్ని తప్పుబట్టారు. చంద్రబాబు అవినీతి చేశాడని ఆరోపిస్తున్న జగన్.. ఈ నాలుగేళ్ల పాలనలో ఏంచేశాడని నిలదీశారు. లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి ప్రజలకు సొమ్ము పంచిన చంద్రబాబు ఈ ముష్టి 370 కోట్లకు ఆశపడతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు వయసుకైనా గౌరవమిచ్చి ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.