Jogi Ramesh: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై జోగి రమేశ్ తీవ్ర విమర్శలు
- చంద్రబాబు అరెస్టును ఎవరూ పట్టించుకోవడం లేదన్న జోగి రమేశ్
- పెత్తందారుల పక్షాన పవన్ కల్యాణ్ పాలేరులా మారాడని తీవ్ర వ్యాఖ్యలు
- చేతకాని చవట సన్నాసులు ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోవడంలేదని మంత్రి జోగి రమేశ్ అన్నారు. వారు పెత్తందారులు కాబట్టే వారికి ఎవరూ అండగా నిలబడటం లేదన్నారు. చంద్రబాబు ఏనాడు ఎవరికీ అండగా నిలబడలేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పెత్తందారుల పక్షాన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాలేరులా మారాడని తీవ్ర విమర్శలు చేశారు. ఇంగ్లీష్ మీడియంపై ఆయన అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారన్నారు.
చేతకాని చవట సన్నాసులంతా ప్రభుత్వంపై విషం కక్కుతున్నారన్నారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అన్నారు. చంద్రబాబు నిజాయతీపరుడంటూ కొంతమంది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆవు దూడ మీద, దూడ ఆవు మీద చెప్పినట్లుగా చంద్రబాబు, లోకేశ్‌ల ప్రవర్తన ఉందన్నారు.
అసలు తన ఆస్తులపై సీబీఐ విచారణ కోరే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని సవాల్ చేశారు. గత టీడీపీ ప్రభుత్వం ప్రజల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయలేదన్నారు. కానీ నేడు జగన్ పాలన సువర్ణయుగంగా ఉందని ప్రజలు చెబుతున్నారన్నారు.