Gujarat: గుజరాత్‌లో గర్బా నృత్యం చేస్తూ గుండెపోటుతో 10 మంది మృత్యువాత

10 people die of heart attack while dancing Garba in Gujarat

  • మృతుల్లో ఎక్కువగా ఉన్న యువత
  • గుండె సంబంధిత సమస్యలతో 108 సర్వీస్‌కి 6 రోజుల్లో 521 కాల్స్
  • గర్బా వేడుకల సమీపంలోని ఆసుపత్రులకు ప్రభుత్వం అలర్ట్

గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గర్బా నృత్యం చేస్తూ పలువురు గుండెపోటుకు గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో ఏకంగా 10 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. బాధితుల్లో యువత, మధ్య వయసు వారు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మరణించినవారిలో బరోడాలోని దభోయ్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు కూడా ఉండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

రాష్ట్రంలో గడిచిన కొన్ని రోజులుగా ఇలాంటి కేసులు వరుసగా నమోదయ్యాయి. అహ్మదాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు గర్బా ఆడుతూ హఠాత్తుగా కుప్పకూలి కన్నుమూశాడు. ఇక కపద్వాంజ్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు కూడా ఇదే విధంగా చనిపోయాడు. నవరాత్రుల మొదటి 6 రోజులలో గుండె సంబంధిత సమస్యలకు సంబంధించి 108 అంబులెన్స్ సర్వీసులకు ఏకంగా 521 కాల్స్ వచ్చాయంటే అక్కడి పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక శ్వాస ఆడకపోవడానికి సంబంధించి 609 కాల్స్ వచ్చాయని, గర్బా వేడుకలు జరిగే సమయం సాయంత్రం 6 మరియు తెల్లవారుజామున 2 గంటల మధ్యలోనే ఈ కాల్స్ వచ్చాయని అధికారులు వివరించారు.

పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ప్రభుత్వంతోపాటు ఈవెంట్ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం స్పందించింది. గర్బా వేడుకల సమీపంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లు హైఅలర్ట్‌గా ఉండాలని ప్రభుత్వం కోరింది.

  • Loading...

More Telugu News