Heart Attack: గంట పాటు గుండె ఆగిపోయినా.. పేషెంట్ ను బతికించిన నాగ్ పూర్ వైద్యులు

38 year old suffers heart attack doctors revive him after 45 minutes of CPR

  • ఆగస్టు 25న 38 ఏళ్ల వ్యక్తికి గుండెపోటు..
  • 45 రోజుల పాటు ఐసీయూలోనే ఉంచిన వైద్యులు
  • ఈ నెల 13న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు వెల్లడి

హార్ట్ ఎటాక్ తో దాదాపు గంట పాటు గుండె ఆగిపోయిన వ్యక్తిని నాగ్ పూర్ వైద్యులు సీపీఆర్ చేసి బతికించారు. ఆపై 45 రోజుల పాటు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) లో వెంటిలేటర్ పై ఉంచి పరీక్షించారు. పూర్తిగా కోలుకున్న ఆ వ్యక్తి ఈ నెల 13న ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నాడు. పేషెంట్ పరిస్థితి, అత్యవసరంగా చికిత్స అందించాల్సి రావడంతో సీపీఆర్ వివరాలను సరిగ్గా నమోదు చేయలేకపోయామని వైద్యులు తెలిపారు. లేదంటే మెడికల్ రికార్డులో అరుదైన కేసుగా నిలిచిపోయేదని నాగ్ పూర్ కిమ్స్ కింగ్స్ వే ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం..
నాగ్ పూర్ కు చెందిన ఐటీ ఉద్యోగి (38) ఆగస్టు 25న అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. అప్పటికి మూడు నాలుగు రోజులుగా పలుమార్లు కళ్లు తిరిగి పడిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గుండెపోటు కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ పేషెంట్ కు డాక్టర్ రిషి లోహియా నేతృత్వంలోని వైద్యుల బృందం కార్డియోపల్మనరీ రిసక్టేషన్ (సీపీఆర్) చేసింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచనల ప్రకారం.. 40 నిమిషాల పాటు సీపీఆర్ చేసినా గుండె తిరిగి కొట్టుకోలేదంటే ఆ రోగి చనిపోయినట్లే.. 

అయితే, ఈ కేసులో 45 నిమిషాల పాటు సీపీఆర్ చేశామని, ఆ తర్వాత గుండె నెమ్మదిగా స్పందించడం ప్రారంభించిందని డాక్టర్ లోహియా తెలిపారు. అదేవిధంగా, ఇలా సుదీర్ఘంగా సీపీఆర్ చేయడం, షాక్ లు ఇవ్వడం వల్ల పక్కటెముకలు విరగడం, షాక్ లకు చర్మం కాలిపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పారు. ఈ కేసులో అన్ని జాగ్రత్తలు తీసుకుని సీపీఆర్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాలేదన్నారు. పేషెంట్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా 45 రోజుల పాటు వెంటిలేటర్ పై ఉంచి ఐసీయూలోనే చికిత్స అందించినట్లు డాక్టర్ లోహియా వివరించారు. పూర్తిగా కోలుకున్నాక ఈ నెల 13న ఇంటికి పంపించినట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News