Sunil Gavaskar: గవాస్కర్ కూడా అదే సూచన.. రోహిత్, ద్రవిడ్ చెవికెక్కించుకుంటారా?
- బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉండాలన్న సునీల్ గవాస్కర్
- సూర్యకుమార్, ఇషాన్ కిషన్ లో ఒకరికి చోటు ఇవ్వాలని సూచన
- ఇదే మాదిరి సూచన చేసిన హర్భజన్ సింగ్
వన్డే ప్రపంచకప్ లో భాగంగా నేడు ధర్మశాల వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. టాప్-2లో ఉన్న ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. దురదృష్టవశాత్తూ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా గాయంతో ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ సమయంలో కాలికి గాయం కావడం తెలిసిందే. దీంతో పాండ్యా స్థానంలో ఎవరికి చోటు లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అయితే సూర్యకుమార్ యాదవ్ లేదంటే ఇషాన్ కిషన్ లో ఒకరిని పాండ్యా స్థానంలో ఆడించాలని సూచించాడు.
ఇప్పుడు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం ఇదే సూచన చేశాడు. ‘‘నేను అయితే బ్యాటింగ్ బలోపేతానికి వీలుగా, జట్టులోకి ఇషాన్ కిషన్ లేదంటే సూర్యకుమార్ యాదవ్ ను తీసుకోవాలని చూస్తున్నాను. న్యూజిలాండ్ పేసర్ల దాడికి ఆరంభంలో వికెట్లను కోల్పోవడం భారత్ కు ఉన్న సమస్య. అందుకే భారత బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉండాలి’అని గవాస్కర్ ఓ మీడియా సంస్థతో అన్నారు. టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సూర్యకుమార్ యాదవ్ లేదంటే శార్ధూల్ ఠాకూర్ లో ఒకరిని తీసుకునే అవకాశాలున్నట్టు సంకేతం ఇవ్వడం గమనార్హం. చివరికి ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి.