Trudeau: నేను ప్రధాని అయితే భారత్ తో సత్సంబంధాలు: కెనడా ప్రతిపక్ష నేత
- కన్జర్వేటివ్ పార్టీ ఆఫ్ కెనడా నేత పొయిలీవ్రే వ్యాఖ్య
- భారత్ తో వ్యవహారం నడపడం ట్రూడోకి చేతకాదని విమర్శ
- ఎంతో నైపుణ్యాలతో వ్యవహరించాల్సి ఉంటుందన్న అభిప్రాయం
- భారతీయులకు ట్రూడో జోకర్ గా మారారని వ్యాఖ్య
భారత్ తో వ్యవహారాలను ఎంతో నైపుణ్యాలతో నిర్వహించాల్సి ఉంటుందని కెనడా విపక్ష నేత, కన్జర్వేటివ్ పార్టీ ఆఫ్ కెనడా నాయకుడు పీయర్ పొయిలీవ్రే అభిప్రాయపడ్డారు. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా పార్లమెంట్ లో ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటన చేసి, భారత్ తో పరోక్ష ద్వైపాక్షిక యుద్ధానికి కాలు దువ్వడం తెలిసిందే. తన ఆరోపణలకు బలమైన సాక్ష్యాలు ఉన్నాయని బుకాయించిన ట్రూడో, వాటిని షేర్ చేయాలని భారత్ కోరినా ఇంత వరకు ఆ పని చేయలేదు. ఈ వ్యవహారంలో రాజకీయ ప్రయోజనం కోసం ట్రూడో పాకులాడేందుకు ప్రయత్నించారు.
ఈ వ్యవహారంలో ట్రూడో వ్యవహరించిన తీరును పొయిలీవ్రే సైతం తప్పుబట్టారు. భారత్ తో ద్వైపాక్షిక సంబంధాల నిర్వహణ ట్రూడోకు తెలియదని విమర్శించారు. భారత్ లో ట్రూడో ఓ జోకర్ గా మారిపోయినట్టు వ్యాఖ్యానించారు. నేపాల్ కు చెందిన నమస్తే రోడియో టొరంటో మీడియా సంస్థకు ఇంటర్వ్యూలో భాగంగా పొయిలీవ్రే ఈ వ్యాఖ్యలు చేశారు. కెనడా దౌత్యవేత్తలను దేశం విడిచి వెళ్లాలని భారత్ కోరడంపై పొయిలీవ్రేకి ప్రశ్న ఎదురైంది. ‘‘అసమర్థుడు, నైపుణ్యాలు తెలియని వాడు’’అంటూ ట్రూడోని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కెనడా ఇప్పుడు దాదాపు అన్ని ప్రపంచ అగ్రగామి దేశాలతో పెద్ద వివాదాలు కొని తెచ్చుకుంటున్నట్టు చెప్పారు.
కెనడా భారత్ తో ఎంతో నైపుణ్యాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. తాను కెనడా ప్రధాని అయితే భారత్ తో సంబంధాలను పునరుద్ధరిస్తానని ప్రకటించారు. ‘‘ప్రపంచంలో భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. రెండు దేశాలూ విభేదాలు కలిగి ఉండడం, ఒకరికి ఒకరు జవాబుదారీగా ఉండడం మంచిదే. కానీ, వృత్తి నైపుణ్యాలతో కూడిన బంధం కలిగి ఉండాలి’’ అని పేర్కొన్నారు.