USA: చైనా దూకుడు.. గగనతలంలో అమెరికా ఫైటర్లతో ఢీ అంటే ఢీ.. వీడియో ఇదిగో!
- ఇండో పసిఫిక్ గగనతలంలో తమ కార్యకలాపాలకు చైనా అడ్డుపడుతోందని యూఎస్ఏ ఆరోపణ
- అమెరికా ఫైటర్లకు చైనా జెట్‌లు అత్యంత సమీపంలోకి వస్తున్నాయని మండిపాటు
- ఇలాంటి ఘటనలు గతేడాది మొత్తం 180 జరిగాయని వెల్లడి
- కొన్ని ఘటనల వీడియోలు తాజాగా విడుదల చేసిన అమెరికా రక్షణ శాఖ
ఇండో పసిఫిక్ ప్రాంతంలో తమ కార్యకలాపాలను అడ్డుకునే లక్ష్యంతో చైనా రెచ్చగొట్టే చర్యలకు దిగుతోందని అమెరికా ఎంతో కాలంగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. గగనతలంలో తమ ఫైటర్ విమానాలకు చైనా విమానాలు తరచూ ఎదురెళుతూ సవాలు విసురుతున్నాయని అమెరికా రక్షణ శాఖ ఆరోపిస్తోంది. అనేక సందర్భాల్లో చైనా విమానాలు ప్రమాదకర రీతిలో అమెరికా విమానాలకు అత్యంత సమీపంలోకి వస్తున్నాయని మండిపడుతోంది.
గతేడాది ఇలాంటి ఘటనలు జరగ్గా ఇందుకు సంబంధించి కొన్ని వీడియోలను అమెరికా రక్షణ శాఖ తాజాగా బహిరంగ పరిచింది. ఈ వీడియోల్లో అమెరికా, చైనా విమానాలు పరస్పరం అత్యంత సమీపంలోకి రావడం స్పష్టంగా చూడొచ్చు. ఆ ప్రాంతంలో అమెరికా వైమానిక కార్యకలాపాలను అడ్డుకునేందుకు చైనా ఓ కేంద్రీకృత ప్రణాళికను అమలు చేస్తోందని అమెరికా రక్షణ శాఖ ఆరోపించింది. గత రెండేళ్లల్లో ఇలాంటి ఘటనలు మొత్తం 180 వరకూ జరిగాయని పేర్కొంది. అమెరికా మిత్ర దేశాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య 400 దాటుతుందని తెలిపింది. ఇలాంటి చర్యలతో పరిస్థితులు ఒక్కసారిగా తిరగబడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.