Bezawada Durgamma: నేడు రెండు రూపాల్లో దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ.. కారణం ఇదే!

Bejavada Durgamma appears in two forms today

  • ఇంద్రకీలాద్రిపై నేటితో ముగియనున్న శరన్నవరాత్రి వేడుకలు
  • నేడు ఒకే రోజు రెండు తిథులు
  • ఉదయం నుంచి మహిషాసురమర్దనిగా అమ్మవారి దర్శనం
  • మధ్యాహ్నం తర్వాత రాజరాజేశ్వరిదేవిగా అభయం
  • తిరుమలలో నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ నేడు రెండు అలంకారాల్లో భక్తులకు అభయం ఇవ్వనున్నారు. నేడు ఒకే రోజు రెండు తిథులు రావడమే ఇందుకు కారణం. నిన్న దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు ఉదయం నుంచి మహిషాసురమర్దనిగా కనిపిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు.

కొండ కాషాయ ధగధగలు
ఇంద్రకీలాద్రిపై నేటితో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనుండడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో కొండ కిక్కిరిసిపోయింది. మరోవైపు, భవానీ మాలధారులతో ఇంద్రకీలాద్రి కుంకుమవర్ణంతో నిగారిస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. నేడు కృష్ణానదిలో దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. 

తిరుమలలోనూ కోలాహలం
తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగింపునకు చేరుకున్నాయి. చివరి రోజైన నేడు వరాహ పుష్కరిణలో స్వామివారి చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ప్రతినిధిగా చక్రత్తాళ్వార్‌కు అర్చకులు స్నపన తిరుమంజనం, అభిషేకం నిర్వహించారు. చక్రస్నానం తర్వాత స్వామి వారిని ఆనంద నిలయానికి చేర్చారు. ఆ తర్వాత భక్తులు శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. 

ఆదివారం అందులోనూ నేడు దసరా పర్వదినం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. స్వామి వారిని నిన్న 77,187 మంది దర్శించుకోగా,  హుండీ ఆదాయం రూ.3.06 కోట్లు వచ్చింది.

  • Loading...

More Telugu News