Cyclone: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ సాయంత్రానికి తుపానుగా మారే అవకాశం
- బంగాళాఖాతంలో తుపాను పరిస్థితులు
- తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం
- ఉత్తర వాయవ్య దిశగా బంగ్లాదేశ్ తీరం వైపు పయనం
- ఈ నెల 25 సాయంత్రం తీరం చేరనున్న తుపాను
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తీవ్ర వాయుగుండం మరింత శక్తిని పుంజుకుని తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.
ఈ సాయంత్రానికి తుపానుగా మారి... ఉత్తర వాయవ్య దిశలో బంగ్లాదేశ్ తీరం వైపు పయనిస్తుందని తెలిపింది. ఈ నెల 25 సాయంత్రం బంగ్లాదేశ్ తీరంలో ఖేపుపారా-చిట్టగాంగ్ ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశముందని ఐఎండీ వివరించింది.
కాగా, విశాఖ వాతావరణ కేంద్రం కూడా దీనిపై అప్ డేట్ అందించింది. కోస్తాంధ్రలో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.