Komatireddy Raj Gopal Reddy: పార్టీ మార్పు ప్రచారం... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- బీఆర్ఎస్ పాలన విముక్తి కోసమే తన పోరాటం ఉంటుందన్న కోమటిరెడ్డి
- మునుగోడు ప్రజల ఆలోచనలకు అనుగుణంగా తన భవిష్యత్తు ఉంటుందని వెల్లడి
- తనపై ఎంత దుష్ప్రచారం చేసినా కేసీఆర్పై పోరాటం ఆగదన్న కోమటిరెడ్డి
మునుగోడు ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే తన భవిష్యత్తు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ... ఈ దసరాతోనే కేసీఆర్ పాలనకు స్వస్తి పలుకుతామని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలన విముక్తి కోసమే తన పోరాటం ఉంటుందన్నారు. ప్రజలు, మునుగోడు కార్యకర్తలు, తన అనుచరుల ఆలోచనలకు అనుగుణంగా భవిష్యత్తు నిర్ణయం ఉంటుందన్నారు. తనపై ఎంత దుష్ప్రచారం చేసినా కేసీఆర్పై పోరాటం ఆగదన్నారు.
కాగా, కోమటిరెడ్డి రేపు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోన్న విషయం తెలిసిందే. బీజేపీ మొదటి జాబితాలో కోమటిరెడ్డి పేరు రాలేదు. మునుగోడుతో పాటు ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని ఆయన కోరుతున్నట్లుగా ప్రచారం సాగింది. అయితే బీజేపీ తొలి జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో కాంగ్రెస్లో చేరుతారనే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.