Malladi Vishnu: టీడీపీ-జనసేన తొలి సమావేశంపై మల్లాది విష్ణు కామెంట్
- ప్రజలంతా ఆధ్యాత్మిక భావనలో ఉన్న సమయంలో పండగ శోభను చెడగొట్టేలా టీడీపీ ప్రవర్తిస్తోందని విమర్శ
- అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తికి ఇది మద్దతిచ్చే సమయమా? అని ప్రశ్న
- 2019లోనే ప్రజలు టీడీపీ వధ చేశారని వ్యాఖ్య
ప్రజలంతా వారం రోజులుగా ఆధ్యాత్మిక భావనలో ఉన్నారని, భజనలు, బతుకమ్మ, ఊరేగింపులతో పండుగ చేసుకుంటున్నారని, కానీ ఈ పండుగ శోభను చెడగొట్టేలా టీడీపీ ప్రవర్తిస్తోందని మల్లాది విష్ణు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తికి ఇది మద్దతు ఇచ్చే సమయమా? అని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. దేవీనవరాత్రుల్లో భాగంగా ప్రజలంతా ఆధ్యాత్మిక భావనలో ఉన్న ఇలాంటి పండుగ సమయంలో కడుపుకు అన్నం తినేవాడు ఎవరైనా నిరసనలకు పిలుపునిస్తారా? అని ప్రశ్నించారు.
టీడీపీ నేతలు బకాసురులు... నరకాసురులు అని మండిపడ్డారు. బకాసురుల మాదిరి ప్రజల సొమ్మును లూటీ చేస్తారన్నారు. 2019లోనే ఆంధ్రప్రదేశ్‌లో నరకాసుర వధలా టీడీపీ వధ జరిగిందన్నారు. టీడీపీ ప్రజలచేత వధించబడటం, తిరస్కరించబడటం ఎప్పుడో జరిగిందన్నారు. న్యాయం గెలవాలని టీడీపీ నేతలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. పసుపు కుంకుమ పేరుతో ప్రజలకు టీడీపీ అన్యాయం చేసిందన్నారు.
అవినీతిలేని, సామాజిక విప్లవం తెచ్చిన పార్టీగా వైసీపీ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. టీడీపీ అకౌంట్‌లో అవినీతి సొమ్ము పడిందని, చందా ఇస్తే తప్పేమిటని అచ్చెన్నాయుడు అనడం తప్పును అంగీకరించడమే అన్నారు. టీడీపీ, జనసేన రెండు పార్టీల తొలి సమావేశమంట... విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.