Natti Kumar: చంద్రబాబు విషయంలో జూనియర్ ఎన్టీఆర్ పునరాలోచించుకోవాలి: నట్టి కుమార్
- స్కిల్ కేసులో రిమాండులో చంద్రబాబు
- సినీ రంగం ప్రముఖులు స్పందిస్తే బాగుంటుందన్న నట్టి కుమార్
- జూనియర్ ఎన్టీఆర్ కనీసం ట్విట్టర్ లో స్పందించినా బాగుండేదని వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 44 రోజుల నుంచి జైల్లో ఉన్నప్పటికీ, టాలీవుడ్ ప్రముఖుల్లో చలనం రాకపోవడం బాధాకరమని నిర్మాత నట్టి కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఇండస్ట్రీలో చంద్రబాబు వల్ల ప్రయోజనం పొందినవాళ్లు, ఆయనతో అనుబంధం ఉన్నవాళ్లు, ఆయన బంధువులు స్పందించాలని తాను ఇటీవల కోరానే తప్ప, ఇండస్ట్రీ మొత్తం స్పందించాలని తాను అనలేదని నట్టి కుమార్ స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలో కొందరు టీడీపీని అభిమానించవచ్చు, కొందరు వైసీపీని అభిమానించవచ్చని, ఇందులో ఎవరి స్వేచ్ఛను తాను ప్రశ్నించబోవడంలేదని అన్నారు.
ఇక, జూనియర్ ఎన్టీఆర్ తన మేనత్త కుటుంబం ఇబ్బందుల్లో పడినప్పుడు స్పందించకపోవడం సరికాదని నట్టి కుమార్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ కనీసం ట్విట్టర్ లోనైనా స్పందించి ఉంటే బాగుండేదని, ఇప్పటికైనా ఆయన చంద్రబాబు విషయంలో పునరాలోచించుకోవాలని సూచించారు.
చిత్ర పరిశ్రమలో చంద్రబాబును అభిమానించేవాళ్లు ఆయన అరెస్ట్ ను ఖండిస్తూ, కొవ్వొత్తులు వెలిగించడమో, లేక మరేదైనా కార్యక్రమమో చేపడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
"చంద్రబాబు అరెస్టయినప్పటి నుంచి ఆయన భార్య నారా భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉన్నారు. నారా లోకేశ్ పార్టీ వ్యవహారాలు, లీగల్ అంశాలను పర్యవేక్షిస్తున్నారు. నారా బ్రాహ్మణి తన పనుల్లో తాను బిజీగా ఉన్నారు. కానీ, వారి కుటుంబానికి దగ్గర బంధువులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, సినీ సెలబ్రిటీలు ఒక్కరిలోనూ కదలిక రాలేదు. వారు ఇంకా జగన్ అంటే భయంలోనే ఉన్నారు. వారిని సినీ రంగం తరఫున స్పందించాలని నేను కోరడం లేదు. చంద్రబాబుకు దగ్గరి బంధువులుగా, ఆయనకు సన్నిహితులుగా, ఆయనతో అనుబంధం ఉన్నవారిగా స్పందించమని కోరుతున్నాను.
మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన సాయపడితే, ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎవరైనా ప్రయోజనం పొందితే... అలాంటివారు చంద్రబాబుకు అండగా నిలిస్తే బాగుండేది. నా మాటలకు ఇద్దరు ముగ్గురు ఫీలవుతున్నట్టు తెలిసింది. చంద్రబాబు అరెస్టయితే... ఆయన వల్ల గతంలో లబ్ది పొందిన వారు, ఎక్కడో ఉగాండాలో ఉపాధి పొందుతున్నవారు, ఐటీ ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా స్పందిస్తున్నారు కానీ, చంద్రబాబుతో అనుబంధం ఉందని చెప్పుకునే సినీ సెలబ్రిటీలు మాత్రం స్పందించడంలేదు. సినిమా వాళ్లు ఏదైనా ఒక మాట చెబితే అది కొన్ని కోట్ల మందికి చేరుతుందన్న ఆశ తప్ప, మీరు మద్దతు ఇవ్వకపోయినంత మాత్రాన చంద్రబాబు, లోకేశ్ కు ఎలాంటి నష్టం జరగదు... ఆ కుటుంబానికి ఏమీ కాదు" అని నట్టి కుమార్ వ్యాఖ్యానించారు.