YSRCP: అమిత్ షాను లోకేశ్ ఎందుకు కలిశారో చెప్పాలి: వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం
- తన భర్త తప్పు చేయలేదని భువనేశ్వరి కాణిపాకంలో ప్రమాణం చేస్తారా? అని ప్రశ్నించిన ఎమ్మెల్సీ రఘురాం
- ఆస్తుల మీద విచారణకు భువనేశ్వరి సిద్ధమా? అని సవాల్
- లోకేశ్ ఏ యాత్ర చేపట్టినా మధ్యలోనే ఆగిపోతుందని గతంలోనే చెప్పానన్న ఎమ్మెల్సీ
- లోకేశ్, పవన్ కల్యాణ్‌లు కలవడం చూసి జనాలు నవ్వుకుంటున్నారని విమర్శ
తన భర్త చంద్రబాబు అవినీతి చేయలేదని నారా భువనేశ్వరి ప్రమాణం చేస్తారా? అని వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని భువనేశ్వరి కాణిపాకంలో ప్రమాణం చేసి తన యాత్రను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే నిజం గెలవాలంటే వారి ఆస్తుల మీద విచారణకు భువనేశ్వరి సిద్ధమా? అన్నారు.
నారా లోకేశ్ ఏ యాత్ర చేపట్టినా మధ్యలోనే ఆగిపోతుందని, తన పాదయాత్రను ఆయన మధ్యలోనే ఆపేస్తాడని తాను ఎప్పుడో చెప్పానన్నారు. తనకే భవిష్యత్తు లేని లోకేశ్ ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ యాత్ర చేయడం విడ్డూరమన్నారు. ఒకచోట ఓడిపోయిన లోకేశ్, రెండుచోట్ల ఓడిన పవన్ కల్యాణ్‌లు కలవడం చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు.
చంద్రబాబు జైలు నుంచి రాసిన లేఖపై సమగ్ర విచారణ జరగాలన్నారు. ఆయన వ్యవస్థలను మేనేజ్ చేస్తాడని, ఈ విషయం రిటైర్డ్ జడ్జిలే చెప్పారన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలను, దేవుడిని నమ్ముతారని, కానీ చంద్రబాబులా వ్యవస్థలను మేనేజ్ చేయడన్నారు. చంద్రబాబు ఆస్తులపై, కేసులపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు. అసలు లోకేశ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఎందుకు కలిశారో చెప్పాలన్నారు.