India: చైనాను వెనక్కి నెట్టి... అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్
- ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో వాణిజ్యం తగ్గినా వెనక్కి చైనా
- అమెరికా-భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం 59.67 బిలియన్ డాలర్లు
- చైనా-భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం 58.11 బిలియన్ డాలర్లు
అమెరికాతో వాణిజ్యంలో చైనాను భారత్ వెనక్కి నెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్యకాలంలో డ్రాగన్ కంట్రీని వెనక్కి నెట్టి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్ నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితితో పాటు ఎగుమతులు, దిగుమతుల్లో భారీ క్షీణత ఏర్పడింది. ద్వైపాక్షిక వాణిజ్యం 11.3 శాతం మేర క్షీణించి 59.67 బిలియన్ డాలర్లకు తగ్గినప్పటికీ భారతే అతిపెద్ద భాగస్వామిగా ఉంది.
ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య అమెరికాకు ఎగుమతులు 38.28 బిలియన్ డాలర్లు నమోదు కాగా, గత ఏడాది ఇదే కాలంలో 41.49 బిలియన్ డాలర్లు నమోదయ్యాయి. దిగుమతులు గత ఏడాది ఇదే కాలంలో 25.79 బిలియన్ డాలర్లు కాగా, ఈ ఏడాది ఇదే కాలంలో 21.39 బిలియన్ డాలర్లకు పరిమితమైంది.
ఇక భారత్, చైనాల వాణిజ్యం 3.56 శాతం మేర తగ్గి 58.11 బిలియన్ డాలర్లుగా నమోదయింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో చైనాకు ఎగుమతులు 7.84 బిలియన్ డాలర్ల నుంచి 7.74 బిలియన్ డాలర్లకు తగ్గగా, దిగుమతులు 52.42 బిలియన్ డాలర్ల నుంచి 50.47 బిలియన్ డాలర్లకు తగ్గింది.