Bhagavanth Kesari: బాలయ్య అభిమానులకు మరో గుడ్‌న్యూస్.. ‘భగవంత్ కేసరి’లో మరో పాట

Good News For Balakrishna Fans Another Song Adding In Bhagavanth Kesari
  • దసరా కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ‘భగవంత్ కేసరి’
  • హైదరాబాద్‌లో సినిమా విజయోత్సవ సభ
  • నాలుగున్నర నిమిషాల నిడివి ఉన్న పాటను యాడ్ చేయబోతున్నట్టు చెప్పిన బాలయ్య
  • మెసేజ్ ఇచ్చేవి కూడా కమర్షియల్ సినిమాలేనన్న బాలకృష్ణ
టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ- దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ దసరా కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీసును దున్నేస్తున్న ఈ సినిమా విజయోత్సవ వేడుకను చిత్ర బృందం హైదరాబాద్‌లో నిర్వహించింది. కనులపండువగా జరిగిన ఈ వేడుకలో బాలయ్య మాట్లాడుతూ.. అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ సినిమాలో ఓ పాటను యాడ్ చేస్తున్నట్టు చెప్పారు. నాలుగున్నర నిమిషాల నిడివి ఉన్న పాటను 50-60 మంది డ్యాన్సర్లతో తీశామని, ఇప్పుడా పాటను యాడ్ చేయబోతున్నట్టు చెప్పారు. 

భగవంత్ కేసరి లాంటి సందేశాత్మక సినిమాలో నటించడం ఆనందంగా ఉందని బాలయ్య అన్నారు. దేశం మొత్తం ఈ సినిమా గురించి చర్చించుకుంటోందని పేర్కొన్నారు. అనిల్ రావిపూడి పాయింట్ చెప్పగానే తనకు నచ్చిందని, ఆ తర్వాత ఇద్దరం కొన్ని పాయింట్ల గురించి చర్చించుకున్నట్టు చెప్పారు. డబ్బులు తెచ్చిపెట్టేవే కమర్షియల్ సినిమాలు కాదని, మెసేజ్ ఇచ్చేవి కూడా కమర్షియల్ సినిమాలేనని అన్నారు. 

తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికిన ఆణిముత్యం శ్రీలీల అని కొనియాడారు. తనకు దొరికిన అద్భుతమైన పాత్రలో అంతే అద్భుతంగా నటించిందని ప్రశంసించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి అని పేర్కొన్నారు. అందరి నుంచి ఆయన చక్కని నటన రాబట్టారని అన్నారు. ప్రతి మహిళకు ఓ సైనికుడిని ఇవ్వలేమని, మహిళలు ఎవరికి వారే ఓ సైనికుడిలా తయారు కావాలని అన్నారు. 

Bhagavanth Kesari
Balakrishna
Sreeleela
Anil Ravipudi
Bhagavanth Kesari Success Celebrations

More Telugu News