Cricket: ఆఫ్ఘనిస్తాన్‌పై ఓటమికి పాక్ కెప్టెన్ బాబర్ చెప్పిన కారణాలివే..!
- అన్ని విభాగాల్లో విఫలమయ్యామన్న బాబర్
- బౌలర్లలో స్పిన్నర్లు రాణించలేకపోయారని వ్యాఖ్య
- ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటామన్న పాక్ కెప్టెన్
ప్రస్తుత వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ తన స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతోంది. ఘోర పరాభవాలను మూటగట్టుకుంటోంది. ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడిన పాకిస్థాన్ కేవలం రెండింట్లో మాత్రమే గెలిచి సెమీస్ అవకాశాలను కూడా సంక్లిష్టంగా మార్చుకుంటోంది. తాజాగా సోమవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్‌పై మ్యాచ్‌లో మరింత పేలవ ప్రదర్శన చేసింది. కనీసం ఏ దశలోనూ మ్యాచ్‌పై పట్టు సాధించలేక ఓడిపోయిన తీరు ఆ టీమ్‌ని అభాసుపాలు చేస్తోంది. అటు స్వదేశంతోపాటు క్రికెట్ విశ్లేషకులు సైతం పాకిస్థాన్ జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంత పేలవంగా ప్రదర్శన చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.
బయట విశ్లేషణలు ఏ విధంగా ఉన్నప్పటికీ మ్యాచ్ ఓటమికి పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కొన్ని కారణాలను వెల్లడించాడు. తాము అన్ని విభాగాల్లో విఫలమవ్వడమే ఓటమికి కారణమని పేర్కొన్నాడు. మంచి టార్గెటే ఇచ్చినా బౌలర్లు రాణించలేకపోయారని, ముఖ్యంగా స్పిన్నర్ విఫలమయ్యారని వివరించాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం, ఫీల్డింగ్‌లో వైఫల్యాలు ఇవన్నీ తమ ఓటమికి దారితీశాయని పేర్కొన్నాడు. ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లు అద్భుత ఆటతీరుని కనబరిచారంటూ ప్రశంసించాడు. టోర్నీలో కీలక సమయంలో ఓడిపోవడం బాధగా అనిపిస్తోందని చెప్పాడు. అయితే ఓటమిని గుణపాఠంగా తీసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు.