Eluri Sambasiva Rao: చంద్రబాబు అరెస్టయిన వారం రోజుల్లో ఈ కుట్ర ప్రారంభమైంది: టీడీపీ నేత ఏలూరు సాంబశివరావు

Eluri Sambasiva Rao alleges fake sim card racket behind votes removing and adding
  • రాష్ట్రంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారన్న టీడీపీ ఎమ్మెల్యే
  • 2.45 లక్షల ఓట్ల తొలగింపుకు ఫారం-7 అప్ లోడ్ చేశారని వెల్లడి
  • 1.20 లక్షల కొత్త ఓట్లు చేర్చేందుకు ఫారం-6 అప్ లోడ్ చేశారని వివరణ
  • దీని వెనుక ఫేక్ సిమ్ కార్డ్ రాకెట్ ఉందని ఆరోపణ
రాష్ట్రంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు భారీ సంఖ్యలో తొలగించే కుట్ర జరుగుతోందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. ప్రతి నియోజకవర్గంలో 25 వేల ఓట్లు తొలగించే కుట్రకు రూపకల్పన చేశారని వెల్లడించారు. చంద్రబాబు అరెస్టయిన వారం రోజుల్లోనే ఈ కుట్ర ప్రారంభమైందని ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు. 

రాష్ట్రం మొత్తమ్మీద 2.45 లక్షల ఓట్ల తొలగింపునకు ఫారం-7 దరఖాస్తులు అప్ లోడ్ చేశారని వివరించారు. దాంతో పాటే కొత్త ఓట్లను చేర్చడం కోసం 1.20 లక్షల ఫారం-6 దరఖాస్తులు అప్ లోడ్ చేశారని తెలిపారు. 

టీడీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించడం, అదే సమయంలో వైసీపీ మద్దతుదారులకు నాలుగైదు చోట్ల ఓటు హక్కు కల్పించేలా దరఖాస్తులు చేయడం వెనుక ఫేక్ సిమ్ కార్డ్ రాకెట్ ఉందని ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 

కొందరు ఎన్నికల అధికారులు అక్రమార్కులకు సహకరిస్తున్నారని, అవకతవకలకు పాల్పడిన వారిపై తూతూమంత్రంగా చర్యలు ఉంటున్నాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పర్చూరులో కొందరు అధికారులు దొరికిపోతే వీఆర్ తో సరిపెట్టారని విమర్శించారు. 189 మంది కుట్రకు పాల్పడితే 12 మందిపైనే చర్యలు తీసుకున్నారని వివరించారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకునేవరకు విడిచిపెట్టేది లేదని ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు.
Eluri Sambasiva Rao
Fake SIM Card Racket
Votes
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News