Amit Shah: తెలంగాణ ఎన్నికలు: అసంతృప్త నేతలతో త్వరలో అమిత్ షా భేటీ!
- ఈ నెల 27న తెలంగాణలో పర్యటించనున్న అమిత్ షా
- సూర్యాపేటలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరు
- అసంతృప్త నేతలతో విడివిడిగా భేటీ కానున్న అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఈ నెల 27న తెలంగాణలో పర్యటించనున్నారు. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పార్టీలన్నీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అధికార పార్టీ మినహా మిగతా పార్టీలు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించనప్పటికీ ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణలో పర్యటించిన అమిత్ షా 27న మరోసారి రానున్నారు. సూర్యాపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ కానున్నారు. బీజేపీ ఇప్పటికే దాదాపు సగం సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది. మరో రెండు మూడు రోజుల్లో రెండో జాబితా రానుంది. మొదటి జాబితాలో తమ పేర్లు లేని కొంతమంది ఆశావహులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరితో అమిత్ షా భేటీ అయి వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసంతృప్త నేతలతో విడివిడిగా సమావేశం కానున్నారు.