Pawan Kalyan: అమిత్ షాతో భేటీ కానున్న పవన్ కల్యాణ్
- ఈ నెల 27న తెలంగాణకు వస్తున్న అమిత్ షా
- సీట్ల సర్దుబాటుపై అమిత్ షా, పవన్ చర్చించే అవకాశం
- ఇప్పటికే పవన్ ను కలిసిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఈ నెల 27న అమిత్ షాను కలవనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి ఈ భేటీలో ఇరువురు నేతలు చర్చించనున్నారు. టీఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని ఇప్పటికే పవన్ ను బీజేపీ కోరింది. మరోవైపు తెలంగాణలో కొన్ని స్థానాల్లో పోటీ చేయాలనే పట్టుదలతో జనసేన ఉంది. ఈ నేపథ్యంలో అమిత్ షాతో పవన్ భేటీ కీలకం కాబోతోంది.
పవన్ తో ఈ నెల 18న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ లు భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీకి జనసేన సంపూర్ణ మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికల్లో 32కి పైగా స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే జాబితాను కూడా ఇప్పటికే జనసేన విడుదల చేసింది. ఈ జాబితాలో కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. సూర్యాపేటలో ఈ నెల 27న జరిగే ప్రచార సభలో పాల్గొనేందుకు అమిత్ షా వస్తున్నారు. ఈ సందర్భంగా అమిత్ షాను పవన్ కల్యాణ్ కలవనున్నారు. సీట్ల సర్దుబాటుపై వీరు చర్చించే అవకాశం ఉంది.