BJP: బీజేపీలోనే ఉండటమా? కాంగ్రెస్‌లోకి వెళ్లడమా?: నేడు వివేక్, రాజగోపాల్ రెడ్డి భేటీ
- వారం రోజుల వ్యక్తిగత టూర్ ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న వివేక్
- సాయంత్రం రాజగోపాల్ రెడ్డితో మాజీ ఎంపీ వివేక్ భేటీ
- కాంగ్రెస్‌లోకి వెళ్లడంపై ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం
తమ పార్టీ నుంచి ఇదివరకు బీజేపీలో చేరిన పలువురు కీలక నేతలకు కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తోందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడో రేపో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం సాగుతోంది. మాజీ ఎంపీ వివేక్ కూడా అదే దారిలో నడిచే అవకాశాలు ఉన్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి, వివేక్‌తో పాటు మరో కీలక మహిళా నేతను కూడా కాంగ్రెస్‌లోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట.
ఈ రోజు సాయంత్రం రాజగోపాల్ రెడ్డి, వివేక్ సమావేశమై కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై చర్చించనున్నారు. వారం రోజుల వ్యక్తిగత పర్యటన ముగించుకున్న వివేక్ ఈ రోజు హైదరాబాద్‌లో అడుగు పెట్టారు. సాయంత్రం రాజగోపాల్ రెడ్డితో భేటీ కానున్నారు. వీరిద్దరు సమావేశమై బీజేపీలోనే ఉండాలా? కాంగ్రెస్‌లో చేరాలా? అనే అంశంపై చర్చించనున్నారు. వీరిద్దరి భేటీ తర్వాత నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
పార్టీలో చేరితే వీరిద్దరికి సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. బీజేపీ విడుదల చేసిన 52 మందితో కూడిన మొదటి జాబితాలో రాజగోపాల్ రెడ్డి, వివేక్ పేర్లు లేవు. దీంతో వీరు పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.