Bangladesh: మహ్మదుల్లా సెంచరీ వృథా... సఫారీల చేతిలో బంగ్లాదేశ్ కు భారీ ఓటమి
- ముంబయి వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
- మొదట 50 ఓవర్లలో 5 వికెట్లకు 382 రన్స్ చేసిన దక్షిణాఫ్రికా
- 46.4 ఓవర్లలో 233 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్
- 111 పరుగులు చేసిన మహ్మదుల్లా
- పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయిన బంగ్లాదేశ్
వరల్డ్ కప్ లో ఆసియా జట్టు బంగ్లాదేశ్ కు నాలుగో ఓటమి ఎదురైంది. దక్షిణాఫ్రికాతో ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ 149 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. 383 పరుగుల భారీ లక్ష్యఛేదనలో మిడిలార్డర్ బ్యాట్స్ మన్ మహ్మదుల్లా వీరోచిత శతకం వృథా అయింది.
బంగ్లాదేశ్ 46.4 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌట్ అయింది. 111 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో 111 పరుగులు చేసిన మహ్మదుల్లా 9వ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే బంగ్లాదేశ్ కథ ముగిసింది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా యువ బౌలర్ గెరాల్డ్ కోట్జీ 3 వికెట్లతో సత్తా నిరూపించుకున్నాడు. మార్కో యన్సెన్ 2, లిజాద్ విలియమ్స్ 2, రబాడా 2, కేశవ్ మహరాజ్ 1 వికెట్ తీశాడు.
ఓ దశలో బంగ్లాదేశ్ 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు 100 పరుగులు చేస్తే గొప్ప అనుకున్న దశలో మహ్మదుల్లా అద్భుత పోరాటంతో స్కోరు 200 దాటింది. కానీ అప్పటికే టాపార్డర్ బ్యాట్స్ అందరూ పెవిలియన్ చేరడంతో బంగ్లా పోరాటం ఏమంత ఆశాజనకంగా సాగలేదు. ఓపెనర్లు టాంజిద్ హుస్సేన్ 12, లిట్టన్ దాస్ 22 పరుగులు చేశారు. నజ్ముల్ హుస్సేన్ శాంటో (0), కెప్టెన్ షకీబల్ హసన్ (1), వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ముష్ఫికర్ రహీమ్ (8) విఫలం కావడం బంగ్లాదేశ్ అవకాశాలపై ప్రభావం చూపింది.
లోయరార్డర్ లో మెహిదీ హసన్ (11), నసుమ్ అహ్మద్ (19), హసన్ మహ్మద్ (15), ముస్తాఫిజూర్ రెహ్మాన్ (11) కాస్త పోరాటం చూపినా, పెరిగిపోతున్న రన్ రేట్ ను అదుపులోకి తీసుకురావడం వాళ్ల శక్తికి మించినపనైంది.
ఈ పరాజయంతో బంగ్లాదేశ్ పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానానికి పడిపోయింది. అటు, దక్షిణాఫ్రికా 5 మ్యాచ్ ల్లో 4 విజయాలతో రెండో స్థానానికి ఎగబాకింది. టీమిండియా 5 మ్యాచ్ ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.