Cricket: డికాక్ విధ్వంసంతో వెనుకబడిపోయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
- అత్యధిక పరుగుల వీరుల జాబితాలో తొలి స్థానానికి డికాక్
- బంగ్లాపై 174 పరుగుల భారీ సెంచరీతో మారిన స్థానాలు
- రెండు, మూడు స్థానాలకు పడిపోయిన కోహ్లీ, రోహిత్
దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ ప్రస్తుత వరల్డ్ కప్ 2023లో అత్యద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారి తన జట్టు భారీ విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడి 3 సెంచరీలు నమోదు చేశాడంటే అతడు ఏవిధంగా చెలరేగుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మరింత విధ్వంసం సృష్టించాడు. 140 బంతులు ఎదుర్కొని 174 పరుగులు సాధించాడు. ఇందులో 7 సిక్సర్లు, 15 ఫోర్లు ఉన్నాయి. దీంతో ప్రస్తుత వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి.
మంగళవారం వరకు అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో కింగ్ విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్ తొలి రెండు స్థానాల్లో ఉండేవారు. కానీ బంగ్లాపై 174 పరుగులు సాధించడంతో డికాక్ ఏకంగా మొదటి స్థానానికి దూసుకెళ్లాడు. మొత్తం 407 పరుగులతో డికాక్ అగ్రస్థానంలో ఉండగా, 354 పరుగులతో రెండవ స్థానంలో కోహ్లీ, 311 పరుగులతో రోహిత్, 302 పరుగులతో రిజ్వాన్ వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. డికాక్ బంగ్లాదేశ్‌పై 174 పరుగులు, శ్రీలంకపై 100, ఆస్ట్రేలియాపై 109 చొప్పున పరుగులు చేసిన విషయం తెలిసిందే. మరి క్వింటన్ డికాక్‌ని ఎవరు అధిగమించుతారో చూడాలి. విరాట్ కోహ్లీ మరో 53 పరుగుల దూరంలో ఉన్నాడు. తదుపరి మ్యాచ్‌లోనూ రాణిస్తే అగ్రస్థానానికి దూసుకెళ్లడం అంతకష్టమైన పని కాకపోవచ్చు.