Telangana: ఆలోచించి రాజకీయాల్లోకి రండి.. విచిత్ర అనుభవం పంచుకున్న మంత్రి కేటీఆర్
- తెల్లవారుజామున 5 గంటలకు ఓ అన్న నుంచి ఫోన్
- వాటర్ ట్యాంక్ తమ పాయింట్ వద్ద పెట్టించాలని వినతి
- ఎమ్మెల్యే కాకముందు అనుభవాన్ని పంచుకున్న తెలంగాణ మంత్రి
రాజకీయాల్లోకి రావాలనుకునేవాళ్లు అన్నీ ఆలోచించుకొని అడుగుపెట్టాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ సూచించారు. రాజకీయాల్లోకి ప్రవేశించడం సులభమేనని, అయితే ఒక్కసారి వస్తే ఆ కష్టాలు వారేలా ఉంటాయని అన్నారు. రకరకాల పంచాయితీలు చేయాల్సి ఉంటుందని సూచించారు. డబ్బు ఉంటే రాజకీయాలు చేయొచ్చనే అభిప్రాయం మన దేశంలో ప్రబలంగా ఉందని, అయితే రాజకీయాల్లోకి ప్రవేశించాక అసలు కథ మొదలవుతుందని అన్నారు. మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ గతంలో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని పంచుకున్నారు.
2009లో ఎమ్మెల్యే అవడానికి ముందు తనకు ఎదురైన ఘటనను కేటీఆర్ వివరించారు. ఎన్నికలకు 6 నెలల ముందు ఆ నియోజకవర్గంలో తెల్లవారు జామున 4.30 -5 గంటల మధ్య తిరిగేవాడినని వెల్లడించారు. ఒకరోజు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఉదయం 5.30 గంటలకు ఒక అన్న తనకు ఫోన్ చేసి వాటర్ ట్యాంక్ గురించి మాట్లాడాడని వివరించారు.
‘‘ అన్నా ఇప్పుడే వాటర్ ట్యాంక్ వచ్చింది. నా పాయింట్ వెనుకే ఉంది. కొంచెం నువ్వు చెప్పి ముందు పెట్టించవా’’ అని అతడు అడిగాడు. ఒరేయ్.. చావాలా.. అంటూ కేటీఆర్ సరదాగా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఎవరి పాత్ర ఏంటి, విధులు, నిర్వచనం, పరిధి గురించి చెప్పేవారేలేరని అన్నారు. మూడో రోజే లీడర్ కావాలని చూస్తున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. నిజానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు ఎవరేం చేయాలో తెలియని పరిస్థితులు ఉండడంతో నేతల మధ్య గొడవలు వస్తున్నాయని పేర్కొన్నారు. క్రీడలు, సినిమాలు, వ్యాపారం, ఉద్యోగం చేయాలంటే ప్రతిభ, నైపుణ్యం ఉండాలని, కానీ రాజకీయాల్లో ఇవేమీ అవసరంలేదని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.