US Pilot: ఆకాశంలో విమానం ఇంజన్ ఆఫ్ చేసేందుకు ప్రయత్నించిన పైలట్ ఏంచెప్పాడంటే..!
- కలగంటున్నా అనుకున్నట్లు విచారణలో వెల్లడించిన పైలట్
- గడిచిన 40 గంటలుగా నిద్రలేకపోవడంతో ఆ పరిస్థితి ఏర్పడిందని వివరణ
- అమెరికాలో ఘటన.. క్రిమినల్ కేస్ పెట్టిన అధికారులు
విమానంలో ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ఇంజన్ ఆఫ్ చేయడానికి ప్రయత్నించాడో పైలట్.. మిగతా పైలట్లు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. అయితే, కాక్ పిట్ నుంచి బయటకు తీసుకెళ్లిన తర్వాత కూడా ఆయన విచిత్రంగా ప్రవర్తించాడు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించగా.. క్యాబిన్ క్రూ అడ్డుకున్నారు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అమెరికాలోని పోర్ట్ ల్యాండ్ లో ఆదివారం జరిగిందీ ఘటన. ఎయిర్ పోర్ట్ లో దిగాక సదరు పైలట్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. తానేం చేస్తున్నానో తెలియకుండా చేశానని, నిద్రలో కలగంటున్నట్లు ఫీలయ్యానని చెప్పాడు.
అలస్కా ఎయిర్ లైన్స్ వివరాల ప్రకారం.. పైలట్ గా విధులు నిర్వహిస్తున్న జోసెఫ్ ఎమర్సన్ (44) ఆదివారం వాషింగ్టన్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో అప్పుడు తను డ్యూటీలో లేడు. అయినప్పటికీ సంస్థ రూల్స్ ప్రకారం జోసెఫ్ కు కాక్ పిట్ లోని జంప్ సీట్ కేటాయించారు. విమానం బయలుదేరిన కాసేపటి తర్వాత జోసెఫ్ విచిత్రంగా ప్రవర్తించాడు. విమానం ఇంజన్ కు ఇంధనం సరఫరాను నిలిపివేసే హ్యాండిల్స్ ను లాగేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన పైలట్లు వెంటనే స్పందించి జోసెఫ్ ను అడ్డుకున్నారు. ఆ హ్యాండిల్ కనుక లాగితే ఇంజన్ ఆఫ్ అయి విమానం కూలిపోయేదని పైలట్లు చెప్పారు.
ఆ తర్వాత కాక్ పిట్ నుంచి జోసెఫ్ ను బయటకు పంపించారు. ముందు వరుసలో సిబ్బందికి కేటాయించిన సీటులో కూర్చోబెట్టగా.. ఈసారి పక్కనే ఉన్న ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. జోసెఫ్ ను గట్టిగా పట్టుకున్న సిబ్బంది డోర్ తెరవకుండా అడ్డుకున్నారు. ఆపై విమానాన్ని పోర్ట్ ల్యాండ్ లో అత్యవసరంగా దించేశారు. జోసెఫ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చేపట్టిన అధికారులకు వింతగా సమాధానాలు ఇచ్చాడు. తను కావాలని చేయలేదని, వీకెండ్ లో తిన్న మష్ రూమ్స్ ప్రభావంతో అలా జరిగి ఉండవచ్చని చెప్పాడు. కాగా, జోసెఫ్ ను నిరవధికంగా విధుల నుంచి తప్పిస్తున్నట్లు అలస్కా ఎయిర్ లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.