Waqar Younis: పాక్ క్రికెట్‌పై మాజీ బౌలర్ వకార్ యూనిస్ సంచలన వ్యాఖ్యలు
- ఆఫ్ఘనిస్థాన్‌పై చెత్తగా ఆడిందంటూ వకార్ విమర్శలు
- ఇక పాక్ క్రికెట్ గురించి మాట్లాడకపోవడం మంచిదన్న మాజీ
- ఆఫ్ఘనిస్థాన్ అద్భుతంగా ఆడిందని ప్రశంసలు
పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఆ జట్టు మాజీ బౌలర్ వకార్ యూనిస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక పాక్ క్రికెట్ గురించి మాట్లాడకపోవడం బెటర్ అని పేర్కొన్నాడు. ఆఫ్ఘనిస్థాన్ సూపర్ క్రికెట్ ఆడితే.. పాకిస్థాన్ చెత్త క్రికెట్ ఆడిందంటూ విమర్శలు గుప్పించాడు. ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఘోరాతిఘోరంగా ఓడిపోయింది. దారుణంగా ఆడిన పాక్ జట్టుపై ఇంటాబయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వకార్ ‘స్టార్ స్పోర్ట్స్’తో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పాక్‌తో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఆల్‌రౌండర్ ప్రతిభతో దుమ్మురేపింది. పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టి సంచలన విజయాన్ని అందుకుంది. అంతకుముందు ఇంగ్లండ్‌ను కూడా ఇలాగే మట్టికరిపించి ప్రశంసలు అందుకుంది. ఈ విజయం గొప్పగా ఉందని ఆఫ్ఘన్ కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ అన్నాడు. తాము ప్రొఫెషనల్‌గా చేజ్ చేశామని పేర్కొన్నాడు. తాము క్వాలిటీ క్రికెట్ ఆడామని, దేశం కోసం, తమ ప్రజల కోసం ఓ చారిత్రాత్మక విజయాన్ని అందివ్వాలని కోరుకుంటున్నట్టు టోర్నీ ప్రారంభంలోనే సహచరులకు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. తొలుత ఇంగ్లండ్‌పై, ఆ తర్వాత పాకిస్థాన్‌పై అది చేసి చూపించామని వివరించాడు.
ఐదు మ్యాచుల్లో మూడింటిలో ఓడిన పాకిస్థాన్ ఇప్పడు క్లిష్టపరిస్థితి ఎదుర్కొంటోంది. ఆ జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టకుండా ఉండాలంటే ఇకపై అన్ని మ్యాచుల్లోనూ గెలవాల్సి ఉంటుంది. శుక్రవారం బలమైన దక్షిణాఫ్రికాను ఎదుర్కోనుంది. మరోవైపు, బంగ్లాదేశ్‌పై ఓటమి తమను తీవ్రంగా కలచివేసిందని పాక్ కెప్టెన్ బాబర్ అన్నాడు.