- ఇఫ్తికార్ ఎవరితో మాట్లాడుతున్నాడంటూ అభిమానుల్లో అయోమయం
- ఆప్ఘనిస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా కనిపించిన దృశ్యం
- ట్విట్టర్ లో తెగ షేరింగ్.. వీడియోపై నవ్వు తెప్పించే కామెంట్లు
ప్రపంచకప్ లో పాకిస్థాన్ ప్రదర్శనపై ఇంటా, బయట పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ క్రికెటర్లు సైతం తమ ప్రదర్శన విషయంలో తీవ్ర అసహనంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇందుకు ఇఫ్తికార్ అహ్మద్ నిదర్శనం. గత సోమవారం పాక్ జట్టుపై ఆప్ఘనిస్థాన్ ఘన విజయం సాధించడం తెలిసిందే. మ్యాచ్ కు సంబంధించి ఓ వీడియో ట్విట్టర్ లోకి చేరగా, దీనిపై అభిమానుల్లో అయోమయం నెలకొంది.
వీడియోలో పాక్ ఆల్ రౌండర్ ఇఫ్తికార్ అహ్మద్ తనలో తానే మాట్లాడుకుంటూ ముందుకు నడుస్తుండడం కనిపిస్తోంది. కాకపోతే తన ముందు ఎవరో ఉంటే, వారితో మాట్లాడుతున్నట్టు దృశ్యం కనిపిస్తోంది. ఇఫ్తికార్ ముందున్న పాక్ క్రికెటర్లు అతడి వైపు చూడడం లేదు. ఇందులో ఇఫ్తికార్ ఎవరితో మాట్లాడుతున్నాడు? అతడిలో అతడు మాట్లాడుతున్నాడా? వంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో క్లిప్ తెగ షేర్ అవుతోంది.
ఇఫ్తికార్ తనలో తానే ఎందుకు మాట్లాడుకుంటున్నాడో చెప్పగలరా? ఈ మిస్టరీ ఏంటి? అంటూ ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ పెట్టాడు. దీనికి కామెంట్లు నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి. అతడి వద్ద టెలీకమ్యూనికేషన్ డివైజ్ ఉందని, అతడు ఏం చెప్పినా వినేవారు ఎవ్వరూ లేరని ఇలా రకరకాల కామెంట్లు వస్తున్నాయి. మ్యాచ్ తర్వాత ఇఫ్తికార్ మాట్లాడుతూ.. ప్రపంచకప్ లో ఇంత వరకు పాకిస్థాన్ స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయినట్టు చెప్పాడు. ‘‘ఫింగర్ స్పిన్నర్లు మా జట్టులో ఉన్నారు. అందులో నేను కూడా ఒకడ్ని. మా పాత్ర అంత మెరుగ్గా లేదు. మేము మరింత మెరుగుపడాలి. అదే మేము చేయాల్సింది’’ అని అతడు పేర్కొన్నాడు.