Komatireddy Raj Gopal Reddy: కవితను అరెస్ట్ చేస్తారని నమ్మి బీజేపీలో చేరాను: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- కేసీఆర్, కుటుంబం అవినీతిపై బీజేపీ విచారణ జరుపుతుందనే ఆ పార్టీలో చేరినట్లు వెల్లడి
- కానీ బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- మునుగోడు నుంచే పోటీ చేస్తానని స్పష్టీకరణ
- తాను పార్టీ మారే సమయంలో రేవంత్ ఆవేశంగా మాట్లాడారన్న కోమటిరెడ్డి
- మునుగోడు నుంచే పోటీ చేస్తానని వెల్లడి
బీజేపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంపై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి స్పందించారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం అవినీతిపై బీజేపీ విచారణ జరుపుతుందనే ఉద్దేశ్యంతో తాను బీజేపీలో చేరానని చెప్పారు. కానీ కేంద్రం వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందని భావించామని, అలాగే కేసీఆర్‌ను గద్దె దించి ఆయన కుటుంబాన్ని జైలుకు పంపిస్తారని ఆశించానని, అందరు కూడా అలాగే అనుకున్నారని, కానీ అది జరగలేదన్నారు. దేశంలోనే అత్యంత అవినీతి సీఎం కేసీఆర్ అని ఆరోపించారు.
పార్టీ మార్పుపై తాను చాలా స్పష్టమైన ప్రకటన చేశానని తెలిపారు. మునుగోడు ప్రజలు తనను గెలిపించాలని భావించినప్పటికీ కేసీఆర్ తనను డబ్బుతో ఓడించారన్నారు. కొన్ని రోజులుగా తెలంగాణలో బీజేపీ బలహీనపడుతోందన్నారు. బీజేపీ నాయకత్వానికి తాను పలు సూచనలు చేశానన్నారు. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కాకపోవడం వల్ల బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేననే భావన వచ్చిందన్నారు. కేసీఆర్ అవినీతిపై విచారణ చేస్తారని నమ్మి తాను బీజేపీలో చేరానన్నారు. కానీ కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తుది శ్వాస వరకు బీజేపీలో ఉండాలనుకున్నానని, కానీ రాష్ట్రంలో కేసీఆర్ అవినీతిపై దృష్టి సారించకపోవడమే తాను పార్టీ మారడానికి ప్రధాన కారణమన్నారు.
తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారని, కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలో పరిస్థితులు మారాయన్నారు. ప్రస్తుతం బీజేపీకి మద్దతిచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే శక్తి కాంగ్రెస్‌కే ఉందన్నారు. తాను తెచ్చిన ఉప ఎన్నికల వల్ల మునుగోడు అభివృద్ధి చెందిందన్నారు. తాను ఎవరినీ రెండు టిక్కెట్లు అడగలేదని, మునుగోడు నుంచే పోటీ చేస్తానన్నారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయనని స్పష్టతనిచ్చారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే గజ్వేల్ నుంచి పోటీ చేసి కేసీఆర్‌ను ఓడిస్తానని, తద్వారా కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రెండుసార్లు ఓడిపోయిందని, కాంగ్రెస్ నాయకత్వం తప్పుడు నిర్ణయాలతో రెండుసార్లు ఓడిపోయామని, కానీ ఇప్పుడు కేసీఆర్‌ను గద్దె దించేందుకు తెలంగాణ సమాజం సిద్ధమైందన్నారు. అందుకే ప్రజల అభీష్టం మేరకు పార్టీ మారుతున్నానన్నారు. గత ఎన్నికల తర్వాత పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కొని ప్రతిపక్షానికి గొంతు లేకుండా చేసిందన్నారు. డబ్బులు, కాంట్రాక్టుల కోసం తాను చూడటం లేదన్నారు. అమ్ముడుపోయే వ్యక్తిని అయితే మళ్లీ పార్టీ ఎందుకు మారుతానని నిలదీశారు.
రేవంత్ రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు
తాను పార్టీ మారే సమయంలో రేవంత్ రెడ్డి ఆవేశంగా మాట్లాడారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అయితే తాను పార్టీలోకి వస్తానంటే కనుక ఓ మెట్టు దిగుతానని ఆయన బహిరంగంగా అన్నారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో తాను మునుగోడు నుంచే పోటీ చేస్తానన్నారు. ప్రాణం ఉన్నంత వరకు మునుగోడులోనే ఉంటానని చెప్పారు.