kuna srisailam goud: వేదిక మీదే బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి: కిషన్ రెడ్డి షేర్ చేసిన వీడియో ఇదిగో

BJP MLA candidate from Quthuballapur Kuna Srisailam attacked by BRS sitting MLA
  • టీవీ ఛానల్ నిర్వహించిన గెలుపెవరిది కార్యక్రమంలో దాడికి యత్నం
  • పరస్పరం భూకబ్జాదారుడు అని ఆరోపణలు గుప్పించుకున్న నేతలు
  • కూన శ్రీశైలం గౌడ్ గొంతు పట్టుకొని వెనక్కి నెట్టిన ఎమ్మెల్యే
  • రంగంలోకి దిగిన పోలీసులు... ఎమ్మెల్యేను ఆపిన పోలీసులు
  • ఇలా దాడి సరికాదంటూ వివేకానందకు సర్దిచెప్పిన ఛానల్ సిబ్బంది
ఎన్టీవీ నిర్వహించిన 'గెలుపెవరిది' కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌పై దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ గూండాయిజానికి ఇది హాల్ మార్క్ అంటూ పేర్కొన్నారు.

బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఓ కార్యక్రమంలో తమ పార్టీకి చెందిన కుత్బుల్లాపూర్ అభ్యర్థిపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. పోటీలో ఉన్న ప్రతిపక్ష అభ్యర్థిపై బహిరంగంగా దాడి చేయడం, గొడవ చేయడం దిగ్భ్రాంతికరమని, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే సామాన్య ప్రజలపై కూడా అదే విధంగా దాడి చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాటల యుద్ధం... ఆపై దాడికి యత్నం

ఎన్టీవీలో గెలుపెవరిది కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ... 2009 నుంచి కూన శ్రీశైలం గౌడ్ ఎమ్మెల్యేగా అయిదేళ్ళపాటు చేశారని, కానీ ఆ తర్వాత ప్రజలు ఆయనకు డిపాజిట్ కూడా ఇవ్వలేదన్నారు. ఆయన పని చేస్తే ఎందుకు గెలిపించలేదని ప్రశ్నించారు.

దీనిపై కూన శ్రీశైలం గౌడ్ స్పందిస్తూ... తాను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వ్యక్తిని అని, కనీసం ఓ పార్టీ గుర్తు లేకుండా ఇండిపెండెంట్‌గా గెలిచానని, కానీ వివేకానంద టీడీపీ నుంచి గెలిచి రూ.10 కోట్లకు అధికార పార్టీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు భూకబ్జాదారు అని ఆరోపణలు గుప్పించుకున్నారు.

ఈ సమయంలో ఎమ్మెల్యే వివేకానంద... తన స్థానం నుంచి ముందుకు వచ్చి కూన శ్రీశైలం గౌడ్‌పై దాడికి యత్నించారు. తనపై దాడి చేసేందుకు యత్నించిన వివేకాను శ్రీశైలం గౌడ్ చేయి పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఎమ్మెల్యే... కూన శ్రీశైలం గౌడ్ గొంతు వద్ద పట్టుకొని వెనక్కి నెట్టారు. ఈ పరిణామంతో అందరూ బిత్తరపోయారు. వెంటనే ఛానల్ సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి, వివేకానందను ఆపారు. ఛానల్ ప్రతినిధి మాట్లాడుతూ... వివేకానంద గారు ఇది కరెక్ట్ కాదు అంటూ ఎమ్మెల్యేను సముదాయించే ప్రయత్నం చేశారు.
kuna srisailam goud
BJP
BRS
Telangana Assembly Election

More Telugu News