medigadda: మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు లేవు... ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది: తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్
- లోపాలు ఉంటే ప్రాజెక్టు మూడు సీజన్లను తట్టుకునేది కాదన్న చీఫ్ ఇంజినీర్ మురళీధర్
- ఇసుక కారణంగా సమస్య వచ్చి ఉంటుందని భావిస్తున్నామని వ్యాఖ్య
- కాపర్ డ్యాం వరద తగ్గాక నవంబర్ చివరలో ఘటనపై సమగ్ర పరిశీలన చేస్తామన్న మురళీధర్
మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని, లోపాలే ఉంటే కనుక ఈ ప్రాజెక్టు మూడు సీజన్లను తట్టుకునేది కాదు కదా... అని తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంపై కేంద్ర బృందం పర్యటన కొనసాగుతోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని కేంద్ర బృందం నిన్న ప్రాజెక్టును పరిశీలించింది. ఈ రోజు రాష్ట్ర నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో భేటీ అయింది. కుంగిన వ్యవహారంపై చర్చించింది.
భేటీ అనంతరం తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ మాట్లాడుతూ... ఏడో బ్లాక్లో సమస్య వల్ల సెంటర్ పియర్ కుంగిందన్నారు. ఎక్కడో చిన్న పొరపాటు జరిగిందన్నారు. ఇసుక కారణంగా సమస్య వచ్చి ఉంటుందని భావిస్తున్నామన్నారు. బ్యారేజీకి సంబంధించి క్వాలిటీ ఆఫ్ శాండ్, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనుమతులు ఉన్నట్లు తెలిపారు. కాపర్ డ్యాం వరద తగ్గాక నవంబర్ చివరలో ఘటనపై సమగ్ర పరిశీలన చేస్తామన్నారు.