Cricket: పాకిస్థాన్ టీమ్‌పై మాజీ దిగ్గజం షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు!
- మామూలు, సాధారణ ఆటగాళ్లను తీసుకొస్తూనే ఉన్నారని మండిపాటు
- గత 20-30 ఏళ్ల సొంత నిర్ణయాల ప్రతిబింబమే ఈ దుస్థితి అని వ్యాఖ్య
- ఇలాగే ఉంటే ఇవే ఫలితాలు వస్తాయని ఆగ్రహం
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న పాకిస్థాన్‌పై విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా పసికూనగా పేర్కొనే ఆఫ్ఘనిస్థాన్‌పై ఓటమి తర్వాత పాక్ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి మాజీ క్రికెటర్ల వరకు అందరూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ జాబితాలో పాక్ మాజీ దిగ్గజం, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ కూడా చేరాడు.
‘‘ మామూలు, సగటు ఆటగాళ్లను తీసుకొస్తూనే ఉండండి. బ్రాండ్ బిల్డింగ్‌ని జోక్‌గా మార్చారు. బ్రాండ్‌ని సృష్టించే వ్యవస్థ నిర్మాణం గురించి మాట్లాడుతున్నాను. ఈ సుదీర్ఘ చర్చలో ఇప్పుడు నేనేం మాట్లాడాలి. పాకిస్థాన్ క్రికెట్ చేరుకున్న స్థానం, ప్రస్తుతమున్న స్థితి గత 20-30 ఏళ్లలో సొంతంగా తీసుకున్న నిర్ణయాలకు ప్రతిబింబం. అలాంటి వ్యక్తులను తీసుకురావడం ఇంకా కొనసాగించండి. అవే తప్పులు చేస్తూనే ఉండండి. అవే ఫలితాలు పొందుతారు’’ అంటూ షోయబ్ అక్తర్ మండిపడ్డాడు. ట్విటర్ వేదికగా పోస్ట్ చేసిన వీడియోలో అక్తర్ ఈ విధంగా పేర్కొన్నాడు.
సోమవారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్ చేతిలో పాకిస్థాన్ ఓటమిపాలైంది. 282 పరుగుల స్కోరును కాపాడుకోలేక చతికిలపడడంపై షోయబ్ అక్తర్ ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఈ వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ ఘోరంగా విఫలమవుతోంది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడగా అందులో రెండింట్లో మాత్రమే గెలిచింది. సెమీస్ అవకాశాలను సంక్లిషంగా మార్చుకుంటున్న విషయం తెలిసిందే.