Cricket: టాస్ చూపించాల్సిందే.. కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చిన పాక్ మాజీ కెప్టెన్!
- క్రికెట్లో మరింత పారదర్శకత పెరుగుతుందని ఐసీసీకి సూచన
- ప్రస్తుత టాస్ విధానం విశ్వసనీయతపై విమర్శలు ఉన్నాయని ప్రస్తావన
- స్పైడర్ కెమెరా ద్వారా టాస్ చూపించాలని విజ్ఞప్తి
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ క్రికెట్‌కు సంబంధించి కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చాడు. గ్రౌండ్లో అందుబాటులో ఉన్న కెమెరాల ద్వారా టాస్ ఫలితాన్ని అభిమానులకు చూపించాలని డిమాండ్ చేశాడు. తద్వారా క్రికెట్లో మరింత పారదర్శకతను తీసుకురావాలని ఈ మాజీ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ని (ఐసీసీ) అభ్యర్థించాడు. ఒక పాకిస్థాన్ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ హఫీజ్ తన వాదనను వినిపించాడు.
స్పైడర్ కెమెరాని జూమ్ చేసి నాణాన్ని చూపించవచ్చని, దాని ద్వారా టాస్ ఫలితాన్ని ప్రేక్షకులకు చూపించవచ్చని హఫీజ్ సూచించాడు. టాస్ సమయంలో కేవలం మ్యాచ్ రిఫరీ మాత్రమే నాణెం నేలపై పడ్డాక దానిని పరిశీలించి టాస్ ఫలితాన్ని ప్రకటిస్తున్నారని గుర్తుచేశాడు. దీంతో టాస్ విశ్వసనీయతపై కొందరు క్రికెట్ ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, టాస్ చూపించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయని హఫీజ్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తాను 2012లో పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించినప్పుడు ఎదురైన సంఘటనలను పంచుకున్నాడు. ఈ మేరకు వరల్డ్ కప్‌ను పర్యవేక్షిస్తున్న ఐసీసీ డైరెక్టర్‌తో కూడా మాట్లాడినట్టు ఆయన వెల్లడించాడు.