Sony TV: ఫ్లిప్ కార్ట్ లో సోనీ టీవీకి ఆర్డరిస్తే.. వచ్చింది మరొకటి!
- సోనీ టీవీ బాక్స్ లో థామ్సన్ టీవీ దర్శనం
- యాక్సెసరీలు కూడా మాయం
- ఫిర్యాదు చేస్తే పట్టించుకోని ఫ్లిప్ కార్ట్
- ఆన్ లైన్ షాపర్లు కళ్లు తెరవాల్సిందే
ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ లలో షాపింగ్ చేస్తున్న వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. ఎందుకంటే కొనుగోలు చేసిన ఉత్పత్తినే డెలివరీ ఇస్తారన్న గ్యారంటీ లేదు. ఇలాంటి అనుభవం ఎదురైన ఓ వ్యక్తి దాన్ని ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నాడు. ఆర్యన్ అనే వ్యక్తి ఇటీవలి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో సోనీ టీవీని కొనుగోలు చేశాడు. ఫ్లిప్ కార్ట్ వాళ్లు వచ్చి డెలివరీ చేసి వెళ్లారు. దాన్ని ఇన్ స్టాల్ చేసి చూపించేందుకు సోనీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వచ్చాడు. బాక్స్ తెరిచి చూడగా, టెక్నీషియన్ తోపాటు, ఆ టీవీని కొనుగోలు చేసిన ఆర్యన్ తెల్లబోవాల్సి వచ్చింది.
బాక్స్ లో సోనీ టీవీకి బదులు థామ్సన్ టీవీ సెట్ ఉంది. పైగా థామ్సన్ టీవీకి సంబంధించి రిమోట్, వాల్ ఫిక్సేషన్ యూనిట్ తదితర యాక్సెసరీలు కూడా అందులో లేవు. దీంతో ఆర్యన్ ఫ్లిప్ కార్ట్ కస్టమర్ కేర్ కు కాల్ చేసి చెప్పాడు. టీవీ ఇమెజెస్ అప్ లోడ్ చేయాలని వారు కోరారు. వారు చెప్పినట్టే థామ్సన్ టీవీ ఫొటోలు తీసి అప్ లోడ్ చేశాడు. అయినా ఎలాంటి స్పందన లేదు. కస్టమర్ కేర్ కు కాల్ చేస్తే ఫొటోలు అప్ లోడ్ చేయాలని చెబుతున్నారే కానీ, అప్ లోడ్ చేశామంటే పట్టించుకునే నాథుడే లేడు. ఇప్పటికి రెండు వారాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్టు బాధితుడు తన గోడును వెళ్లబోసుకున్నాడు.
చివరికి ఫ్లిప్ కార్ట్ ఆర్యన్ ఇచ్చిన కంప్లయింట్ ను పరిష్కరించినట్టు స్టేటస్ పెట్టి, స్పందించడం మానేసింది. రిటర్న్ రిక్వెస్ట్ ను కూడా అనుమతించలేదు. కనుక 10-20 శాతం డిస్కౌంట్ వస్తోందని చూసుకోకుండా, నేరుగా షోరూమ్ కు వెళ్లి కొనుగోలు చేసుకోవడమే మెరుగైనదని ఇలాంటి అనుభవాలు చెబుతున్నాయి.