G Jagadish Reddy: కోమటిరెడ్డి సోదరులకు కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం: మంత్రి జగదీశ్ రెడ్డి
- బీఆర్ఎస్‌పై ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారన్న జగదీశ్ రెడ్డి
- రేవంత్, కిషన్ రెడ్డిలు కూడబలుక్కొని విమర్శలు చేస్తున్నారన్న మంత్రి
- రైతుబంధు ఆపాలని కాంగ్రెస్ ఫిర్యాదు చేయడం దుర్మార్గమని వ్యాఖ్య
శాసనసభ ఎన్నికల్లో కోమటిరెడ్డి సోదరులకు ప్రజలు కర్రుగాల్చి వాతపెట్టడం ఖాయమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ... దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని పథకాలను కేసీఆర్ ఇస్తున్నారని, అందుకే ప్రజలు బీఆర్ఎస్‌పై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిలు కూడబలుక్కుని తమపై పసలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు.
కేసీఆర్ ప్రతిష్ట తెలంగాణ దాటి బయటికొస్తే ప్రమాదమని ఆ పార్టీల నేతలు భయపడుతున్నారని విమర్శించారు. కర్ణాటకలో విద్యుత్ ఇవ్వడంలేదని కారణంతో సబ్ స్టేషన్లలో మొసళ్లతో రైతులు నిరసనలు తెలుపుతున్నారన్నారు. నాయకులు పార్టీలు మారడం సహజమేనని, ప్రజలపై ఆ ప్రభావం ఉండదన్నారు. బీఆర్ఎస్‌పై ప్రజల్లో ఎలాంటి అసంతృప్తి లేదన్నారు.
కాంగ్రెస్ ఫిర్యాదు చేయడం దుర్మార్గం
రైతుబంధు ఆపేయాలని కాంగ్రెస్ ఫిర్యాదు చేయడం దుర్మార్గమని జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో గడపగడపకు బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేసీఆర్ పథకాలను కాంగ్రెస్ ఆపేయాలని చూస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ చర్యలపై ప్రజలు తిరగబడి ప్రశ్నించాలన్నారు. ఉచిత విద్యుత్, మిషన్ భగీరథలను కూడా కాంగ్రెస్ ఆపేసేలా ఉందని విమర్శించారు. తెలంగాణ మోడల్‌ను ఇతర రాష్ట్రాలు అడుగుతుంటే మన వద్ద కాంగ్రెస్ వాటిని ఆపేయాలని చూస్తోందన్నారు.
ఇక్కడ కేసీఆర్ పెట్టిన పథకాలు ఆపేస్తే దేశంలో ఇలాంటి పథకాల గురించి చర్చ జరగదని కాంగ్రెస్ ఆలోచన చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలను ప్రజలు గమనించాలన్నారు. తమకు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్న బీజేపీకి అసలు పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరన్నారు.