Cricket: దుబాయ్‌లో ఐపీఎల్ వేలం!.. ఎప్పుడో తెలుసా?
- డిసెంబర్ 19న జరగనుందని పేర్కొంటున్న రిపోర్టులు
- అదే తొలిసారి విదేశాల్లో జరిగే ఐపీఎల్ వేలం
- ఈ సారి అన్ని జట్లకు కలిపి రూ.100 కోట్ల వరకు పరిమితి
ఐపీఎల్‌కి ప్రపంచవ్యాప్తంగా ఎనలేని క్రేజ్ ఉంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా తెలుసుకుంటుంటారు. అలాంటివారి కోసం మరో కీలక అప్డేట్ వచ్చింది. రాబోయే ఐపీఎల్ 2024 ఆటగాళ్ల వేలానికి ఈసారి దుబాయ్ వేదికవబోతోందని తెలుస్తోంది. డిసెంబర్ 19న వేలం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయం ఇంకా అధికారికంగా నిర్ధారణ కాకపోయినప్పటికీ.. అదే జరిగితే విదేశాల్లో ఆటగాళ్ల వేలం నిర్వహించడం ఇదే తొలిసారికానుంది.
ఆటగాళ్ల వేలం డిసెంబర్ 19న జరగనుందని క్రిక్ఇన్ఫో రిపోర్ట్ పేర్కొంది. ఇందుకు సంబంధించి రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు, విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితాను అందించడానికి ప్రాంచైజీలకు నవంబర్ 15 చివరి తేదీగా ఉందని పేర్కొంది. కాగా ఈసారి పది జట్లు కలిపి ఆటగాళ్ల కోసం గరిష్ఠంగా రూ.100 కోట్ల వరకు ఖర్చు చేయవచ్చు. గతంలో రూ.95 కోట్లు ఉండగా మరో ఐదు కోట్లను జతచేయనున్నారని రిపోర్ట్ వివరించింది. దీంతో జట్లు కీలక ఆటగాళ్లను దక్కించుకునేందుకు మరింత ఎక్కువ మొత్తం వెచ్చించే అవకాశాలున్నాయి. రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ఖరారు చేసుకున్న తర్వాత ఏ జట్టు దగ్గర ఎంత డబ్బు ఉంటుందనేది తెలియనుంది.
ప్రస్తుతానికైతే పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా రూ.12.20 కోట్లు ఉన్నాయి. ఐపీఎల్ 2023లో తీవ్ర నిరాశ కలిగించే ఫలితాలు ఎదురవ్వడంతో ఆ జట్టు కొంతమంది ఆటగాళ్లను విడిచిపెట్టింది. దీంతో ఆ జట్టు వద్ద ఎక్కువ డబ్బు ఉంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ.1.5 కోట్లు, గుజరాత్ టైటాన్స్ వద్ద రూ.4.5 కోట్ల మేర ఉన్నాయి.