China: చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ కన్నుమూత
- 68 ఏళ్ల వయసులో గుండెపోటుతో తుదిశ్వాస
- అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మరుగునపడిన లీ కెకియాంగ్
- సంస్కరణ భావాలున్న వ్యక్తిగా విశిష్ట గుర్తింపు
చైనా మాజీ ప్రధానమంత్రి లీ కెకియాంగ్ కన్నుమూశారు. 68 ఏళ్ల వయసున్న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని చైనా అధికారిక మీడియా శుక్రవారం ప్రకటించింది. సంస్కరణల ఆలోచలు ఉన్న బ్యూరోక్రాట్‌గా విశిష్ట గుర్తింపు తెచ్చుకున్న లీ కెడియాంగ్ ఒకానొక సమయంలో చైనా భవిష్యత్తు నాయకుడిగా మారతాడని అంతా భావించారు. అయితే అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కారణంగా మరుగునపడిపోయారు. దాదాపు పదేళ్లపాటు అధ్యక్షుడు జిన్‌పింగ్ హయాంలోనే ప్రధాన మంత్రిగా పనిచేసి విశేష సేవలు అందించారు.
లీ గురువారం గుండెపోటుకు గురయ్యారని, హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తుండగా శుక్రవారం తెల్లవారు జామున ఆయన శ్వాస విడిచారని ఆ దేశ అధికార మీడియా ‘జిన్షూవా’ తెలిపింది. ఆయన కొంతకాలంగా షాంఘైలోనే ఉంటున్నారని తెలిపింది. ప్రధానమంత్రిగా పనిచేస్తున్న సమయంలో తనతోటి వారితో పోల్చితే ఆధునిక వ్యక్తిగా గుర్తింపుపొందారు. ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడగలిగే సామర్థ్యమున్న ఆయన చైనా ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు.
యువతను ఉదారవాద భావనలవైపు ప్రోత్సహించేవారు. అయితే పార్టీ పరిమితులను ఏమాత్రం దాటేవారు కాదు. ఆయన పార్టీ అధినేతగా ఉన్న సమయంలో హెనాన్ ప్రావిన్స్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరం ద్వారా హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తి చెందడం ఆయనకు పెద్ద కళంకంగా మిగిలిపోయింది. ఆయన ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసింది.