Golden Rule: వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కోసం అమెరికా మిలియనీర్ చెప్పిన చిట్కా ఏమిటంటే..!
- రోజుకో గంట ఆదాయాన్ని పక్కన పెట్టాలని సూచిస్తున్న డేవిడ్ బాష్
- దీనివల్ల రిటైర్ మెంట్ తర్వాత డబ్బు చికాకులు ఉండవని వెల్లడి
- ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత కోసం యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న బాష్
అరవై ఏళ్లు వచ్చే వరకు కష్టపడి పనిచేసిన వారు రిటైర్ మెంట్ తర్వాత ఆనందకరమైన జీవితం గడపాలని కోరుకుంటారు.. ముఖ్యంగా డబ్బు చికాకులు ఉండకూదని అనుకుంటారు. అయితే, సంపాదించే వయసులో పొదుపు చేయకపోతే వృద్ధాప్యంలో కష్టాలు తప్పవని న్యూయార్క్ కు చెందిన రచయిత, బ్లాగర్, ఆర్థిక నిపుణుడు డేవిడ్ బాష్ హెచ్చరిస్తున్నారు. ప్రతీ వ్యక్తి తన ఆదాయంలో కనీసం 14 శాతం పొదుపు చేయాలని చెబుతున్నారు. అప్పుడే విశ్రాంత జీవితాన్ని ఆనందంగా గడిపే వీలుంటుందని చెప్పారు.
వివిధ పన్నులు, అద్దె, రుణాల చెల్లింపులు, తిండి, రవాణా తదితర ఖర్చుల చెల్లింపులకే వచ్చే ఆదాయం మొత్తం పోతుందని, ఇక పొదుపు అనే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందని చాలామంది భావిస్తారని బాష్ చెప్పారు. అయితే, ప్రతీ వ్యక్తి తన జీవితంలో సుమారు 9 వేల గంటలు పనిచేస్తారని, అందులో రోజుకు ఓ గంట ఆదాయాన్ని ముందే పక్కన పెట్టాలని అంటున్నారు. ధనవంతులుగా మారాలన్న కలను నిజం చేసుకోవడానికి ఈ ఒక్క సూచన పాటిస్తే చాలంటున్నారు.
ఉద్యోగం, వృత్తి లేదా వ్యాపారంలో రోజు వారీ సంపాదనలో ఓ గంటకు పొందే ఆదాయాన్ని తప్పకుండా పొదుపు ఖాతాకు మళ్లించాలని చెప్పారు. దీనిని మంచి రాబడిని ఇచ్చే మార్గాల్లో పొదుపు చేయడం వల్ల రిటైర్ మెంట్ తర్వాత ఆర్థిక భరోసా కలుగుతుందని వివరించారు. ప్రస్తుతం జనాలలో ఆర్థిక అక్షరాస్యత కొరవడుతోందని చెప్పిన బాష్.. ఆర్థిక అక్షరాస్యత పెంపొందించేందుకు యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు.