Pakistan: కాసేపట్లో దక్షిణాఫ్రికాతో కీలక మ్యాచ్.. తీవ్ర ఒత్తిడిలో పాకిస్థాన్
- ప్రపంచకప్ లో హ్యాట్రిక్ ఓటములతో పాకిస్థాన్ జట్టు
- కాసేపట్లో చెన్నైలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్
- ఈ మ్యాచ్ లో ఓడితే సెమీస్ అవకాశాలు సంక్లిష్టం
వన్డే ప్రపంచకప్ లో పాకిస్థాన్ జట్టు పోరాట పటిమ లేని తన చెత్త ప్రదర్శనతో ఇంటా, బయటా విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చివరకు ఆఫ్ఘనిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో ఆ జట్టుపై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు ఆడిన పాకిస్థాన్ చివరి మూడు మ్యాచ్ లలో ఓడిపోయి హ్యాట్రిక్ ఓటమిని మూటకట్టుకుంది. తద్వారా సెమీస్ అవకాశాలను బలహీనం చేసుకుంది.
మరోవైపు కాసేపట్లో చెన్నైలో దక్షిణాఫ్రికాతో పాకిస్థాన్ తలపడనుంది. దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు ఆడగా... వాటిలో నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించి, మంచి స్థానంలో ఉంది. ఈ రోజు జరగనున్న మ్యాచ్ పాకిస్థాన్ కు చాలా ముఖ్యం. ఈ మ్యాచ్ లో గెలవకపోతే పాకిస్థాన్ కు సెమీస్ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్టే. దీంతో, ఆ జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఒత్తిడిని జయించకపోతే ఆ జట్టు గెలిచే అవకాశాలు మరింత తగ్గిపోతాయి.
అన్ని విభాగాల్లో బలంగా ఉన్న ప్రొటీస్ ను ఎదుర్కోవడం పాక్ కు అంత ఈజీ కాదు. బ్యాట్స్ మెన్లు డీకాక్, క్లాసెన్, మిల్లర్ భారీ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఈ టోర్నీలో డీకాక్ ఇప్పటికే మూడు సెంచరీలు బాదాడు. మరోవైపు బౌలర్లు రబడ, మార్కో జాన్ సెన్, కొయిట్జీ, కేశవ మహరాజ్ లు ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తిస్తున్నారు.